కొత్త పార్లమెంటు.! ఏం కొత్తగా మారుతుందని.?

కొత్త పార్లమెంటు గురించి దేశవ్యాప్తంగా పెద్దయెత్తున కమలదళం అత్యద్భుత ప్రచారానికి తెరలేపింది. ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, ఈ కొత్త పార్లమెంటుని కట్టిస్తున్నారనీ, దేశ చరిత్రలో నరేంద్ర మోడీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనీ కమలదళం చెబుతోంది.

నిజమే కావొచ్చు.! కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే, నిజానికి ఈ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సింది రాష్ట్రపతి. కానీ, రాష్ట్రపతికి ఆ అవకాశం ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకోవడంలేదట.!

పబ్లిసిటీ విషయంలో ప్రధాని మోడీ ఒకింత ఎక్కువ కేర్ తీసుకుంటుంటారు మరి. ఆ ఘనత తన ఖాతాలో వేసుకోవాలి కదా.? అందుకే, బహుశా రాష్ట్రపతిని ప్రస్తుతానికి దూరం పెట్టారేమో. ఇటీవల తెలంగాణలో కొత్త సెక్రెటేరియట్ నిర్మిస్తే, ఆ సెక్రెటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కి ఆహ్వానం అందలేదు. ముఖ్యమంత్రి కేసీయార్ చేతుల మీదుగానే తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరిగింది.

రాష్ట్రానికి ప్రధమ పౌరుడు లేదా పౌరురాలు అంటే గవర్నర్. దేశం విషయంలో రాష్ట్రపతి. ఆ లెక్కన, కొత్త పార్లమెంటుకి ప్రారంభోత్సవం చేయాల్సింది రాష్ట్రపతే కదా.!

సరే, ఆ సంగతి పక్కన పెడితే, కొత్త పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా వర్ధిల్లుతుంది.? విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తారా.? ప్రజా ప్రతినిథులు అర్థం పర్ధంలేని విమర్శలతో సభా సమయం దుర్వినియోగం కాకుండా బాధ్యతాయుతంగా మెలగుతారా.?