వైఎస్సాకాంగ్రెస్ పార్టీలో జగన్ వీరవిధేయుల్లో ఒకడిగా భావించే కోటంరెడ్ది శ్రీధర్.. అలా భావించినవారందరికీ షాకిస్తూ ఫ్యాన్ కిందనుంచి పక్కకు జరిగారు. జరిగితే జరిగారు.. వెంటనే సైకిల్ ఎక్కేస్తున్నాట్లు ప్రకటించేసుకున్నారు. దీంతో తమపార్టీలోకి శ్రీధర్ రాకపై మాంచి కాకమీదున్నట్లు కామెంట్లు చేస్తున్నారు నెల్లూరు టీడీపీ నేతలు!
ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నెక్స్ట్ ఏ పార్టీలో చేరబోతున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అదేంటి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేయబోతున్నట్లు ఆయనే ప్రకటించేసుకున్నారుగా? అవును… ఆయనకు ఆయనే ప్రకటించేసుకున్నారు! ఇప్పుడు ఇదే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
శ్రీధర్ రెడ్డి రాకను నెల్లూరు టీడీపీ నేతలు ఏమాత్రం భరించలేకపోతున్నారు! ఈ విషయంలో సీనియర్లు – జూనియర్లు అనే తేడా లేకుండా.. శ్రీధర్ రెడ్డి రాకను ముక్తకంఠంతో తిరస్కరిస్తున్నారు! అందుకు తాజాగా శ్రీధర్ రెడ్డిని ఉద్దేశిస్తూ… టీడీపీ నేత అబ్ధుల్ అజీజ్ చేసిన కామెంట్లే ప్రత్యక్ష ఉదాహరణ! క్రికెట్ బెట్టింగులు ఆడేవారిని – సింగిల్ నెంబర్లు ఆడించేవారినీ టీడీపీలోకి ఆహ్వానించేది లేదని చెబుతున్నారు నెల్లూరు టీడీపీ నేత అజీజ్! అక్కడితో ఆగని ఆయన… ఎవరైనా ఇంట్లో పూల మొక్కలు – పండ్ల మొక్కలు పెంచుకుంటారుగానీ.. గంజాయి మొక్కను పెంచుకోరుగా అంటూ తీవ్రస్థాయిలో శ్రీధర్ రాకపై స్పందించారు. ఇదే క్రమంలో… ఇంతకాలం టీడీపీ నేతలపై దాడులుచేసినవారు – కేసులు పెట్టి వేధించినవారు.. తిరిగి టీడీపీలో చేరడాన్ని ఏ కార్యకర్తా ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరితే, ముందు ముందు ఏకు మేకై కుర్చుంటాడని, ఫలితంగా తమ అజమాయిషీకి చెక్ పడిపోద్దని బలంగా నమ్ముతున్నారంట ఆ జిల్లా టీడీపీ సీనియర్ నేతలు అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర! దీంతో… వారు కూడా వరుస ప్రెస్ మీట్ లు పెట్టి… టీడీపీ విలువలు గల పార్టీ అని, ఎవరు బడితే వారిని చేర్చుకోమని.. బెట్టింగు రాయళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించే నాయకులు తమకు అవసరం లేదని చెప్పుకొస్తున్నారు.
దీంతో కోటంరెడ్డి.. టీడీపీలో చేరే పరిస్థితి ఉంటుందా? చేరితే.. ఆ జిల్లాలో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రశాంతంగా ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి! మరి… ఎవరు అవునన్నా – కాదన్నా శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వస్తారు అని చంద్రబాబు స్టేట్ మెంట్ ఇస్తారా? లేక, ఈయన ఒక్కడికోసం అంతమందిని ఇబ్బందిపెట్టడం ఎందుకని శ్రీధర్ రెడ్డి ఫోన్ ఎత్తడం మానేస్తారా? అన్నది వేచి చూడాలి! అదే జరిగితే… కోటంరెడ్డి పరిస్థితి రెంటికీచెడ్డ రేవటిలా మారిపోతుందనడంలో సందేహం లేదనే అనుకోవాలి!