వైసీపీ కొంప ముంచనున్న ఆ అరవై శాతం.!

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో కొడాలి నాని లాంటి కొందరు వైసీపీ నేతలు, ’60 శాతం మంది ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదని నివేదికలు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే విషయం చెప్పారు. సరిగ్గా పని చేయకపోతే పార్టీలో టిక్కెట్లు దక్కడం కష్టం. నాకైనా అది వర్తిస్తుంది..’ అంటూ కొడాలి నాని తదితర నేతలు వ్యాఖ్యానించారు.

‘ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వుందిగానీ, ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకత లేదు..’ అని సదరు నేతలు బుకాయింపులకు దిగారు. ‘పులుసు ఒకటి, అందులోని బద్ద ఒకటి.?’ అంటూ ఓ పాత ముతక సామెత ఒకటుంది. అలా వుంది, వైసీపీ నేతల విశ్లేషణ.

వైసీపీ పైకి ఏం చెబుతున్నా, ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత పెరిగిందని ఆ పార్టీ ముఖ్య నేతలకూ తెలుసు. అధికారంలో వున్నవారెవరికైనా ఇది మామూలే. సంక్షేమ పథకాల్ని ఏ పార్టీ అధికారంలో వున్నా అమలు చేస్తుంది.. కొత్త సంక్షేమ కార్యక్రమాల్నీ తెరపైకి తెస్తూనే వుండాలి.

సో, సంక్షేమ పథకాల్ని అమలు చేసినంతమాత్రాన ఆయా పార్టీల్ని ఇంకోసారి జనం గెలిపించే పరిస్థితి వుండదు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ చెప్పే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా, ‘మనం ప్రజలకు పూర్తిగా సేవ చేయలేదు.. అందుకే బొటాబొటి మార్కులు..’ అంటూ 2009 ఎన్నికల ఫలితాల తర్వాత వ్యాఖ్యానించారు.

కానీ, వైసీపీ మాత్రం మొత్తంగా అన్ని సీట్లనూ కొల్లగొట్టేస్తామనీ, సంక్షేమం వల్లనే అది సాధ్యమవుతుందనీ అంటోంది. ఇదిలా వుంటే, 60 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చేయకపోతే కష్టమంటూ ఇంకోసారి ఐ-ప్యాక్ టీమ్ నివేదిక వైసీపీకి అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. అరవై శాతం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. అంటే, అది చాలా చాలా ఎక్కువే మరి. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే, ఐదారుశాతం ఓటు బ్యాంకు కూడా ఫలితాల్ని మార్చేస్తుంది మరి.