భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సెప్టెంబర్ 17న పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇది ఆయనకు 70వ పుట్టినరోజు. గత రెండు దశాబ్దాలుగా దేశంలో ఏ రాజకీయ నాయకుడూ గడించలేనంత పేరును మోదీ గడించారు. ప్రపంచ స్థాయిలో కూడ భారత ప్రధానిగా మోదీ మంచి కీర్తి తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్బంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. సెప్టెంబర్ 14 నుండి మొదలైన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ 20వ తేదీ వరకు జరపనున్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాహుల్ గాంధీ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ ప్రజానీకం సైతం సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ ‘హ్యాపీ బర్త్ డే పిఎం మోదీ’అనే హ్యాష్ ట్యాగ్ మీద విషెస్ చెబుతూ టాప్ ట్రైండింగ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో యువకులు సోషల్ మీడియాలో ‘నేషనల్ అన్ ఎంప్లాయిమెంట్ డే’ పేరుతో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇది మోదీ బర్త్ డేతో సమానంగా ట్రెండ్ అవుతుండటం ఆశ్చర్యకరం. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను అందరికీ తెలిసేలా చేయడం కోసమే ప్రధాని పుట్టినరోజును వేదికగా ఎంచుకున్నారు నెటిజన్లు. ఎన్ఎస్ఓ లెక్కల ప్రకారం దేశంలో వృద్ది రేటు దారుణంగా 23.9 శాతం పడిపోయింది. ఇంత భారీగా జీడీపీ పతనమవడం గత 40 ఏళ్లలో ఇదే ప్రథమం. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగం పెరిగిపోయింది. కొత్త ఉద్యోగాలు దొరక్కపోవడమే కాక ఉన్న ఉద్యోగాలు కూడ పోతున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఈ విపత్కర పరిస్థితి దాపురించింది.
ఈ విపత్తు నుండి దేశాన్ని బయటపడేయటంలో మోదీ సర్కార్ విఫలమైందని విపక్షాలతో పాటు పెద్ద ఎత్తున యువత కూడ ఆరోపిస్తున్నారు. నరేంద్ర మోదీగారు.. మీరు మీ కృష్టితో ప్రపంచంలోనే ఎక్కువ నిరుద్యోగ యువత ఉన్న దేశంగా మన దేశాన్ని నిలబెట్టారని, యేడాదికి 2 కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చారు.. ఆ ప్రకారమే ఉద్యోగాలు పీకేస్తున్నారని కొందరు, ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు.. మోదీగారు జీడీపీలో, నిరుద్యోగంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారని, ఈ ట్రెండ్ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికేనని కొందరు ట్వీట్లు వేస్తున్నారు. ఈ ట్రెండ్ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉండటం విశేషం. మొత్తానికి కుర్రాళ్లు పుట్టినరోజునాడే ప్రధానికి భారీ షాకిచ్చారు.