ఢిల్లీలో ధర్నా… జగన్ కు ‘ఇండియా’ కూటమి, అంబానీ టీమ్ సపోర్ట్!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని, భయానక వాతావరణం నెలకొందని, వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా దారుణంగా దాడులు జరుగుతున్నాయని, పాశవిక చర్యలు తెరపైకి వస్తున్నాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీటికి నిరసనగా ఢిల్లీలో ధర్నా చేపట్టింది.

ఈ క్రమంలో… ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని, కలిసి రావాలని ఈ సందర్భంగా జగన్ అన్ని పార్టీలకూ పిలుపునిచ్చారు. అయితే… అటు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి కానీ, ఇటు విపక్ష ఇండియా కూటమికి కానీ చెందనటువంటి వైసీపీ చేస్తున్న ఈ ధర్నాకు ఏమాత్రం మద్దతు ఉండకపోవచ్చనే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే… అనూహ్యంగా ఏపీలో జగన్ చేపట్టిన ధర్నాకు ఊహించని స్థాయిలో ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పార్టీల నుంచి మద్దతు లభించింది. ఇదే సమయంలో పరోక్షంగా అంబానీ టీమ్ మద్దతు కూడా లభించినట్లయ్యిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. దీంతో… ఢిల్లీ వేదికగా జగన్ చేపట్టిన ధర్నా సక్సెస్ అయినట్లేనని.. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతుందని అంటున్నారు.

అఖిలేష్ యాదవ్ సంఘీభావం!:

ముందుగా… ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు ఎన్డీయేలో కీలక పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రం యూపీలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ సంస్కృతి ఏమాత్రం మంచిది కాదని, విపక్షాలే లక్ష్యంగా పాలక పక్షాలు దాడులకు పాల్పడటం సరైన చర్య కాదని అన్నారు.

ఇక ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, రేపు మళ్లీ జగన్ అధికారంలోకి రావొచ్చు అని చెప్పిన అఖిలేష్ యాదవ్… తాను మాత్రం ఈ బుల్డోజర్ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు. పార్టీకి బలమైన కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారని తెలిపారు.

కాగా… ఇండియా కూటమిలో సమాజ్ వాదీ పార్టీ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్ సభలో 37, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అలాంటి అఖిలేష్ యాదవ్.. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన జగన్ ధర్నాకు మద్దతు ఇవ్వడం అంటే.. అది ఇండియా కూటమికి తెలియకుండా జరిగింది కాదని, రాజ్యసభలో జగన్ పై ఆదారపడిన మోడీకి ఇది బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు!

ఏపీ సర్కార్ పై శివసేన ఎంపీ నిప్పులు!:

ఇదే సమయంలో… ఢిల్లీలో జగన్ చేస్తున్న ధర్నాకు శివసేన (యూబీటీ) కూడా మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీలో నేరాలు – ఘోరాలకు సంబంధించి వైసీపీ ఏర్పాటు చేసిన ఫోటో / వీడియో ఎగ్జిబిషన్ ను చూసిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్.. ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో గత 45 రోజులుగా నరమేదం కొనసాగుతోందని.. అది దేశానికే మంచిది కాదని తెలిపిన సంజయ్ రౌత్… దేశంలో కేంద్ర హోంమంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే… వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తర్వాత… ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కు మద్దతుగా అంబానీ ఆప్తుడు!:

ఏపీలో జరుగుతున్న నేరాలు-ఘోరాలపై జంతర్ మంతర్ వేదికగా జగన్ తలపెట్టిన ధర్నాలో అంబానీకి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్ నత్వానీ కూడా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ధర్నా వేదిక వద్ద చాలా సేపు కనిపించడంతో… జగన్ కు అంబానీ టీమ్ కూడా అండగా నిలుస్తోందనే సంకేతాలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి!