నారా లోకేష్‌కు తన స్టామినా ఏమిటో గత ఎన్నికలతో బాగా తెలిసిపోయింది. ప్రత్యర్థుల ప్రచారం కొంత, స్వీయ తప్పిదాల ఫలితం కొంత కలిసి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేశాయి. స్వయానా చంద్రబాబు నాయుడు కుమారుడై ఉండి ఓడిపోవడంతో బయట, పార్టీలో రెండు చోట్లా చులకనైపోయారు. ఇక ఆయన్ను లేపడానికి కూడ చంద్రబాబుకు ఆస్కారం లేకపోయింది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి వెయిట్ పెంచుదామని భావించారు. కానీ పలు కారణాల రీత్యా అది కూడ కుదరక అచ్చెన్నాయుడును అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని భావించారు. మొదట్లో అధ్యక్ష పదవి మీద అంతగా ఆసక్తి చూపని లోకేష్ అచ్చెన్నాయుడుకు పదవి అనగానే ఆలోచనలో పడ్డారు.
అచ్చెన్నాయుడు సామాన్యమైన వ్యక్తి కాదు. బాబుగారి నీడలో రాజకీయాలను అవపోసన పట్టిన బుర్ర ఆయనది. అవకాశం చిక్కాలే కానీ ఎక్కడైనా నిరూపించుకోగలడు. ఇక ఆయన కుటుంబం కూడ రాజకీయంగా బలమైన నేపథ్యం కలది. ప్రస్తుతం టీడీపీలో హుషారుగా ఉన్న వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు కుటుంబానికి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రథమంగా కనిపిస్తారు. జగన్ గాలిని తట్టుకుని గెలిచి శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు. వాళ్ల కుటుంబానికి గనుక అధ్యక్ష పదవి దక్కితే సీన్ మారిపోతుంది. బాబు తర్వాత వాళ్లే కనిపిస్తారు. లోకేష్ ఇంకా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
ఈ సంగతిని గ్రహించే లోకేష్ అధ్యక్ష పదవికి అచ్చెన్నాయుడు పేరును ప్రకటించకుండా బాబును ఆపుతున్నారని టాక్ నడుస్తోంది. పాత అధ్యక్షుడు కళా వెంకట్రావు అయితే డామినేట్ చెయ్యటం లాంటి ఇబ్బందులేవీ ఉండవని, ఆయన్నే అధ్యక్షుడిగా కొనసాగించాలనేది చినబాబు కోరికట. ఒకవేళ ఇదే నిజమై లోకేష్ అధ్యక్షుడి మార్పును కాదనడాన్ని చంద్రబాబు నాయుడు గనుక మన్నిస్తే పార్టీ పరిస్థితిలో ఎలాంటి పురోగతి ఉండదు. కాదు కూడదు, పార్టీ భవిష్యత్తే ముఖ్యమని అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేస్తే మాత్రం లోకేష్ భయపడుతున్న ప్రమాదం జరగొచ్చు కూడ. మరి బాబుగారు వీటిలో ఏదో ఒకదాన్ని త్యాగం చేస్తారా లేక తన చాణక్యంతో పార్టీని, పుత్రుడిని కాపాడుకునేలా ఏదైనా సర్దుబాటు చేస్తారా చూడాలి.