నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. కొన్ని చోట్ల పలచగా సాగినా.. చాలా చోట్ల చాలా చాలా హంగామా నడుమ నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది యువగళం పాదయాత్ర.
ఇంతకీ, పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ఏం సాధించారట.? పాదయాత్ర చేస్తే అధికారం దక్కుతుందన్నది తెలుగునాట రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ వుంది. తన తండ్రిని ఇంకోసారి అధికార పీఠమెక్కించేందుకు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఇది.
పాదయాత్ర కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చు.. ఆయన యాత్రలో స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో జనాల్ని తరలించడం చాలా చాలా పెద్ద టాస్క్. అందుకోసమే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ రోజుల్లో రాజకీయ పార్టీల కార్యక్రమాలకి స్వచ్ఛందంగా జనం తరలి రావడం అనేది జరిగే పని కాదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఆయనకున్న సినీ అభిమానుల కారణంగా, జనసేన రాజకీయ యాత్రలకి జనాన్ని డబ్బులు ఖర్చు పెట్టి రప్పించాల్సిన అవసరం ఏర్పడటంలేదనుకోండి.. అది వేరే సంగతి.
ప్రభుత్వం తరఫున వైసీపీ ఖర్చు చేయిస్తున్నా.. పార్టీ తరఫున టీడీపీ ఖర్చు చేస్తున్నా.. ఈ రెండు పార్టీల సభలకీ, రాజకీయ కార్యక్రమాలకీ.. జనాన్ని మాత్రం తరలించక తప్పడంలేదు. అధికార వైసీపీ, అధికారిక కార్యక్రమాలతో పండగ చేసుకుంటోంది. ‘వై నాట్ 175’ అంటోంది.. అది వేరే వ్యవహారం.
టీడీపీ పరిస్థితేంటి.? లోకేష్ పాదయాత్రతో లాభమెంత.? 200 రోజుల పాదయాత్ర అంటే చిన్న విషయం కాదు. సగానికి పైగా పాదయాత్ర పూర్తయిపోయింది. మిగిలిన సగం తేలిగ్గానే నెట్టుకొచ్చేస్తారు. అయితే, పాదయాత్ర వల్ల లాభం శూన్యమని పార్టీ వర్గాలో ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయ్. అంటే, ఖర్చు దండగ వ్యవహారమనే కదా.!