యువగళం అంటూ లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే వందరోజులు దాటిబోయి తాజాగా సీఎం సొంత జిల్లా కడపలోకి ఎంటరయ్యారు. ఈ పాదయాత్ర వల్ల పార్టీకి ఒరిగిందేమిటనేది ఉన్నపలంగా అడిగితే లోకేష్ అభిమానులు కూడా చెప్పలేని పరిస్థితి. దీనికి తగ్గట్లుగానే వారి అనుకూల మీడియాలోనూ పాదయాత్రకు ఇస్తున్న ప్రయారిటీ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో తమ్ముళ్లు ఎంచుకున్న కొత్త మార్గాన్ని చూసినవారు… కడపలో టీడీపీని వైఎస్ వివేకా కాపాడతారా అనే చర్చను తెరపైకి తెస్తున్నారు.
తనపాదయాత్రతో అటు వారి అనుకూల మీడియాపైనా, ఇటు కేడర్ పైనా, అటు ప్రజానికంపైనా ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారనే విమర్శను ఎదుర్కొంటున్న లోకేష్… తాజాగా వైఎస్ వివేకాను నమ్ముకున్నట్లు తెలుస్తుంది. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తాం.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం అనే విషయాలపై తాను మాట్లాడుతున్నా ప్రజల్లో స్పందన రావడం లేదని గ్రహించారో ఏమో కానీ… తాజాగా “హూ కిల్డ్ బాబాయ్” టాపిక్ ని ఎత్తుకున్నారు లోకేష్.
ఇందులో భాగంగా… వివేకా డెడ్ బాడీతో పాటు.. ముఖ్యమంత్రిని జగన్, ఎంపీ అవినాశ్ ఫోటోను ప్రింట్ చేసిన ఫ్లకార్డులు చేతపట్టి పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. అటు సొంత కార్యకర్తలు కూడా ఈ వ్యవహారంపై పెదవి విరుస్తున్నారు. హూ కిల్డ్ బాబాయ్ అనేదానికి కోర్టులు సమాధానం చెబుతాయి.. సాధారణ ప్రజానికానికి దానితో ఏమి సంబంధం.. పైగా ఇప్పటికే అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇలాంటి సమయంలో ఇంకేమీ సమస్యలు లేవని చెబుతున్నట్లుగా ఉంది వ్యవహారం అని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
వైసీపీ నేతలను, ఏపీ ముఖ్యమంత్రినీ, వైసీపీ కార్యకర్తలనూ కవ్వించడానికి తప్ప ఈ ఫ్లకార్డుల ప్రదర్శన దేనికి ఉపయోగపడుతుందో చెప్పాలని లోకేష్ ను ఆన్ లైన్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఎంతలా ప్రయత్నించినా పాదయాత్రకు మైలేజీ రానందువల్లే… వివేకా హత్య ఉదంతాన్ని అసరాగా చేసుకొని అందరి చూపు తన మీద పడేలా చేసుకోవాలన్నదే లోకేశ్ కొత్త ఆలోచన అని వైసీపీ కార్యకర్తలు స్పందిస్తున్నారు. మరి ప్రజోపయోగం కాని ఈ విషయాన్ని ఎత్తుకుని.. ఆ మండుటెండలో లోకేష్ సాధించేది ఏమిటి… ఇందుకోసమేనా పాదయాత్ర అని పాదయాత్రలోనే ప్రజలు చెవులు కొరుక్కోవడం గమనార్హం!