జూనియర్ ఎన్టీయార్ జపం మొదలెట్టిన నారా లోకేష్.!

టీడీపీ పగ్గాలు యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి అప్పగించేయాలంటూ గత కొంతకాలంగా టీడీపీలోని కొందరు నందమూరి అభిమానులే కాదు.. యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని సినిమా హీరోగా అభిమానించేవాళ్ళూ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీయార్ ఫొటోలతో కూడిన పొలిటికల్ జెండాల్ని తమ భుజాన మోస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబుకి కూడా షాక్ ఇస్తున్నారు ఈ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.

ఇంతకీ, ఈ విషయమై నారా లోకేష్ అభిప్రాయమేంటి.? జూనియర్ ఎన్టీయార్‌ని రాజకీయాల్లోకి నారా లోకేష్ రానిస్తారా.? లేదా.? ఈ విషయమై తనకు టీడీపీ శ్రేణులు సంధించిన ఓ ప్రశ్నపై నారా లోకేష్ స్పందించారు. ‘నూటికి నూరు శాతం ఆహ్వానిస్తా.. జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలి. రాష్ట్రం బాగు కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలి..’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.

2009 ఎన్నికల సమయంలోనే జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ కండువా భుజాన వేసుకున్నారు.. రాష్ట్రమంతా పర్యటించారు. అప్పట్లో అదో ప్రభంజనం. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేకపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

కానీ, జనాన్ని ఉద్దేశించి యంగ్ టైగర్ ఎన్టీయార్ చేసిన ప్రసంగాలు అప్పట్లో, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. యాక్సిడెంట్ కారణంగా, ఆ ఎన్నికల ప్రచారం చివర్లో అర్థాంతరంగా ఆగిపోగా, గాయాలతో.. మంచమ్మీద నుంచి కదల్లేని పరిస్థితుల్లో కూడా వీడియో ద్వారా తన సందేశాన్ని జూనియర్ ఎన్టీయార్ పంపించాడు.

మరి, టీడీపీ ఏం చేసింది.? నారా లోకేష్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు జూనియర్ ఎన్టీయార్‌ని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్, అదే జూనియర్ ఎన్టీాయర్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?