పవన్ పై లోకేష్ ట్వీట్… సేనాని ప్లేట్ ఫిరాయిస్తే?

ఈ రోజు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్ కాబోతోంది. అయితే ఈసారి యాత్రకు ఒక ప్రత్యేకత ఉందనేది తెలిసిన విషయమే. టీడీపీ – జనసేన పొత్తు అధికారికంగా కన్ ఫాం అయిన తర్వాత జరుగుతున్న మొదటి యాత్ర ఇది. అంటే… ఈ వారాహి యాత్రలో పసుపు జెండాలు కూడా దర్శనమివ్వబోతున్నాయన్నమాట. ఇదే విషయాన్ని టీడీపీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది కూడా.

ఇదే సమయంలో.. “జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారి నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నాను” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ట్వీట్ కింద కనిపిస్తున్న కామెంట్లు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… ఈ సమయంలో ఎన్నికల సమయానికి చంద్రబాబు బయటకు రానిపక్షంలో.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ప్లేట్ ఫిరాయిస్తే.. అప్పటికే పవన్ సభలకు అలవాటైన టీడీపీ కేడర్, కొంతమంది నాయకులు పవన్ వెంట నడిస్తే… టీడీపీ పుట్టె మునగడం ఖాయం కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో సరికొత్త చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది. దానికి ఒక బలమైన కారణం ఉంది!

ఉమ్మడి రాష్ట్రంలో 2009 ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టులు-టీఆరెస్స్ (నేటి బీఆరెస్స్) తో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్నారు. వైఎస్సార్ సింగిల్ గా పోటీచేసి ఈ మహాకూటమిని మట్టికరిపించారు. ఇక, రాష్ట్ర విభజన అనంతరం సీనియారిటీ అంటూ 2014లో బీజేపీతో పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లారు. జనం నమ్మారు.. అధికారం అప్పగించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ చంద్ర్బాబు ఏమి చేశారు అనేది ఇప్పుడు జగన్ సర్కార్ తవ్వి తీస్తుంది!

ఇదే క్రమంలో 2019 నాటికి అటు ఎరుపు ద‌ళానికి, మ‌రోవైపు కాషాయ‌ద‌ళానికి, ఇంకా గులాబీ ద‌ళానికి కూడా వ్య‌తిరేకంగా కాంగ్రెస్ తో జ‌త క‌ట్టి పోటీ చేశారు చంద్ర‌బాబు! ఈ రేంజ్ లో పొత్తులు పెట్టుకోగలగడం సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబుకి మినహా మరొకరికి సాధ్యంకాదని అంటుంటారు పరిశీలకులు. అయితే… బాబుని తలదన్నే స్థాయిలో పవన్ ఉన్నారని చెబుతున్నారు.

జ‌న‌సేన పార్టీ ప్రకటించిన పవన్ కల్యాణ్… అసలే చీకటి గాడాంధకారం అని చెబుతూ, ప్రశ్నిస్తాను అని అంటూ టీడీపీ – బీజేపీల జెండాలు మోసారు! ఇక 2019 ఎన్నికల్లో ఆ రెండు జెండాలు ఎత్తి అవతల పారేసి ఎర్ర‌జెండాల‌ను, బ‌హుజ‌న జెండాను భుజాన వేసుకున్నాడు. దీంతో… ఎర్ర జెండా చేతపడితే జై చేగువేరా.. కాషాయ జెండా చేతపడితే జై గాడ్సే అంటారనే కామెంట్లు వినిపించాయి.

ఇప్పుడు మరళా 2024 ఎన్నికల నాటికి ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నాను, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీతో కలిసి పోటీ చేస్తాను అని ప్రకటించారు పవన్. దీంతో చంద్రబాబుకు ఏమాత్రం తగ్గకుండా పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయగలడని.. అందుకే వీరిద్దరికీ బాగా కుద్రిందని అంటున్నారు. వీరిద్దరినీ చూసి ఊసరవెళ్లిలు ఆత్మహత్య చేసుకుంటే ఆ నేరం ఎవరిది? అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో… ఇప్పుడు జనసేన సభలకు, వారాహి యాత్రలకు పసుపు జెండాలు చేతపట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా బయలు దేరాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు లోకేష్ ట్వీట్ కూడా చేశారు. దీంతో పవన్ సభ అంటే జనాలు ఎలాగూ బలంగా వస్తారు.. దీంతోపాటు ఇప్పుడు టీడీపీ జెండాలు కూడా కలిస్తే మరింత జనం పెరుగుతారు. ఇక టీడీపీ నుంచి ఎంతమంది నేతలు వచ్చినా… కింద నుంచిని వినాల్సిందే తప్ప.. వారాహి వాహనం ఎక్కే ఛాన్స్ లేదనేది తెలిసిన విషయమే!

ఆ సంగతి అలా ఉంటే… ఈ వారాహి యాత్రల్లో జనసేనానిపై టీడీపీ కేడర్ మొగ్గు చూపితే… అంతకంటే ముఖ్యంగా లోపల ఉన్న బాబు కంటే బయట ఉన్న, జన సమీకరణలో ఢోకా లేని పవన్ ను నమ్ముకుంటేనే బెటరని టీడీపీ నేతలు అంటే… అలా వారు నిర్ణయించుకున్న అనంతరం పవన్ ప్లేట్ ఫిరాఇస్తే…? అప్పుడు టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది అతి పెద్ద ప్రశ్నగా ఉంది!

తాజాగా లోకేష్ ట్వీట్ కింద కనిపించిన కామెంట్లను నిశితంగా పశీలించి, విశ్లేషిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమైపోద్దని అంటున్నారు విశ్లేషకులు. మరి… టీడీపీ ఫ్యూచర్ ఇప్పుడు పవన్ చేతిలో పెట్టారు కాబట్టి… ఆయన నీట ముంచుతారో, పాల ముంచుతారో వేచి చూడాలి!