ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయనేది వాస్తవం. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా పార్టీ పుంజుకుంటున్న సూచనలు కనిపించట్లేదు. తెలుగుదేశానికి క్షేత్రస్థాయిలో బలం చాలా ఎక్కువ. గెలుపోటములు అటు ఇటు అయినా కేడర్ చెక్కుచెదరలేదు. దీన్నే టార్గెట్ చేసి పెట్టుకున్నారు వైఎస్ జగన్. గత ఎన్నికల్లో
పార్టీ చిత్తుగా ఓడినా కార్యకర్తల్లో, అభిమానుల్లో టీడీపీ మీద నమ్మకం సన్నగిల్లలేదు. లీడర్లు, ఎమ్మెల్యేలు పార్టీని వీడినా చంద్రబాబు ఉన్నంతవరకు పార్టీకి ఢోకా లేదనేది శ్రేణుల నమ్మకం. ఎన్ని కష్టాలు వచ్చినా బాబు పార్టీని నిలబెడతారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని కూల్చడం అంత ఈజీ కాదు. దాన్ని బలహీనపర్చాలంటే అధినాయకుడిని దెబ్బతీయాలి. అప్పుడే కేడర్ చెల్లాచెదురవుతుంది. అందుకే చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మీద దృష్టి కేంద్రీకరించారు జగన్.
కుప్పంలో జగన్ దెబ్బకు చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల్లో తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతూనో, స్థిరంగా ఉంటూనే వచ్చిన ఆ మెజారిటీ 2019 ఎన్నికల్లో డౌన్ అయింది. 30 వేలకు పడిపోయింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇదే ఆయనకు అత్యల్ప మెజారిటీ అంటున్నారు. ఈ ఊపులోనే అక్కడ పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉన్నపళంగా కుప్పంను మున్సిపాలిటీని చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పింఛన్లు, ఆసరా పథకాలు అంటూ ప్రతి ఒక్కరికీ పూర్తి లబ్దిని అందిస్తున్నారు. కరోనా కారణంగా చంద్రబాబు గత 10 నెలలుగా కుప్పంకు వెళ్లలేకపోయారు. ఈ గ్యాప్లో చాలా రాజకీయమే నడిచింది. లోకల్ నాయకులు చాలామంది వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కేడర్ పరిమాణం పెరిగింది. టీడీపీలోకి చేరికలనేవే లేకుండా పోయాయి.
ఇంకో ఏడాది ఇలాగే సాగితే కుప్పం చంద్రబాబు చేయి జారిపోవడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. కుప్పం మీద పట్టు కోసం జగన్ ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్పను అపాయింట్ చేశారు. వీరిద్దరూ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. మెల్లగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ చంద్రబాబు ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. అందుకే త్వరగా ప్రతిచర్య జరపాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ రంగంలోకి దిగుతారనే టాక్ మొదలైంది. ఇన్నాళ్లు తండ్రి చూసుకున్న కుప్పంను ఇకపై లోకేష్ చూసుకుంటారట. చంద్రబాబు ఇప్పుడప్పుడే కుప్పం పర్యటనకు వెళ్లే అవకాశాం లేదు. ఈలోపు లోకేష్ అక్కడ క్యాంప్ పెట్టనున్నారట.
త్వరలోనే ఆయన కుప్పం పర్యటనకు వెళ్తారట. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తారట. లోకేష్ చేయనున్న ఈ పర్యటన మామూలుగా ఉండదని అంటున్నాయి పార్టీ వర్గాలు. కుప్పంలో ఉన్న ప్రతి కార్యకర్తతో, నాయకుడితో లోకేష్ ఇంటరాక్ట్ అవుతారని, వారిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపుతారని చెబుతున్నారు. పార్టీని వీడిన నాయకులను సైతం వెనక్కు తీసుకొచ్చే మంతనాలు జరుపుతారట. కాకపొతే ఇప్పటికే కుప్పంలో జగన్ ఒక
పద్మవ్యూహాన్ని సిద్ధంచేసి ఉంచారు. పోయి పోయి అందులోకి లోకేష్ అడుగుపెడట్టబోతున్నారు. మరి పద్మవూహంలోకి వెళ్లగలిగే దారి తెలిసిన లోకేష్ దాన్ని చేధించుకుని రాగలరా లేకపోతే అందులోనే ఇరుక్కుపోతారా అనేదే ప్రశ్నగా మారింది.