ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు.. నోటి నుంచి వచ్చే మాట కొంప ముంచెయ్యకూడదు.! కానీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం, టీడీపీని నిలువునా పాతరేసేస్తుంటారు. పాపం ఆయన మాత్రం ఏం చేయగలడు.? నోరు తిరగదాయె.! తాజాగా, దళితులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. ‘దళితులు పీకిందేమీ లేదు..’ అన్న మాట నారా లోకేష్ నోటి వెంట వచ్చింది. నిజానికి, నారా లోకేష్ ఉద్దేశ్యం వేరు. ‘దళితులకు వైఎస్ జగన్ పీకింది ఏమీ లేదు..’ అనాలనుకున్నారు. అయితే, అక్కడ జరిగింది ఇంకోటి.
కట్ అండ్ పేస్ట్ వీడియోలకు ఈ రోజుల్లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అవి క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయ్. అలాగే నారా లోకేష్ వ్యాఖ్యలూ వైరల్ అయ్యాయి. దళితుల పట్ల నారా లోకేష్‌కి వున్న తేలిక భావానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని అధికార వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది.
గతంలో, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా, ‘దళితులుగా ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారు.?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. అప్పుడు తండ్రి చంద్రబాబు, ఇప్పుడు తనయుడు లోకేష్.. మొత్తంగా దళితుల్లో టీడీపీని పలచన చేసి పారేశారు.
ఇన్నాళ్ళూ నారా లోకేష్ కష్టపడి పాదయాత్ర చేసి టీడీపీకి తెచ్చిన మైలేజ్.. ‘దళితులు పీకింది ఏమీ లేదు’ అన్న ఒక్క మాటతో మటుమాయమైపోయింది. అబ్బే.. అలా అన్లేదు.. అని లోకేష్ బుకాయించిన ప్రయోజనం లేదిప్పుడు.!