యువగళం: ‘వారాహి’ పాట పాడిన నారా లోకేష్.!

తెలుగుదేశం పార్టీక, జనసేన పార్టీకీ మధ్య పొత్తు కుదిరిపోయిందా.? కుదిరిపోతే, ఆ విషయాన్ని ఇరు పార్టీల అధినాయకత్వాలూ తమ తమ పార్టీలకు చెందిన ముఖ్య నేతలకైనా అధికారిక సమాచారం ఇవ్వాలి కదా.?

‘జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అంటున్నారు జనసేన అధినేత. ‘మేమే అధికారంలోకి వస్తాం’ అంటున్నారు టీడీపీ అధినేత. ఇంకోపక్క, జనసేన మీదకు టీడీపీ అధినేత వలపు బాణాలు సంధిస్తున్నారు. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చబోమంటూ’ టీడీపీతో ప్రేమ విషయాన్ని దాదాపు కన్ఫామ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

అధికారికంగా చెప్పేశాక.. ఇరు పార్టీలూ జనం వద్దకు ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ, అసలు విషయం చెప్పడం లేదాయె.! నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మొదటి రోజున, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువగళం ఆగదు.. వారాహి ఆగదు’ అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య లోపాయకారీ అవగాహన బహిర్గతమైపోయింది.

ఎప్పుడైనా ప్రభుత్వంలో వున్నవారిపై విపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సి వుంటుంది. రాజకీయాల్లో ఇదంతా మామూలే. కానీ, పైకి కత్తులు నూరుతూ, తెరవెనుకాల స్నేహ సంబంధాలు కొనసాగిస్తేనే అది హాస్యాస్పదమవుతుంది.

చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు.? టీడీపీ – జనసేన పొత్తుని అధికారికంగా ప్రకటించేస్తే, పవన్ ‘వారాహి’ యాత్రల్లో టీడీపీ జెండాల్ని, నారా లోకేష్ యువగళం యాత్రలో జనసేన జెండాల్ని చూసే అవకాశం దక్కుతుంది కదా జనానికి.