హేయ్ జగన్… చినబాబు సెల్ఫీ సవాల్!

ప్రస్తుతం ఏపీలో యువగళం అంటూ లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో ఇంతకాలం వెటకారాలు, మితిమీరిన విమర్శలు, స్థాయి మరిచిన కామెంట్లు చేసుకుంటూ.. మీసాలు తిప్పుకుంటూ.. తొడలు కొట్టుకుంటూ తిరిగిన లోకేష్… తాజాగా క్రియేటివ్ గా ఆలోచించారు.. ఫలితంగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు!

మాటలు వద్దు చేతలు ముద్దు అనుకున్నారో ఏమో కానీ… విమర్శలు తగ్గించిన చినబాబు.. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు, ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరిగాయో, ఎక్కడెక్కడ పరిశ్రమలు స్థాపించబడ్డాయో చూపిస్తూ అక్కడి ఉద్యోగులతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతూ ముందుకుపోతున్నారు.

ఇందులో భాగంగా… తాజాగా రేణిగుంటలో పాదయాత్ర చేస్తున్నప్పుడు, దారిలో జోహో ఐ‌టి కంపెనీ కనిపిస్తే, లోనికి వెళ్ళి అందరినీ పలకరించి మాటామంతీ కలిపారు లోకేష్. అనంతరం అక్కడి ఉద్యోగులతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతూ.. “మూడున్నరేళ్ళలో మీ వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో సెల్ఫీ తీసుకొని చూపాలి” అంటూ సవాళ్ళు విసురుతున్నారు.

అక్కడితో ఆగని చినబాబు… “హేయ్ జగన్, జోహో కంపెనీలో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కళ్ళలో ఆనందం, వారి మొహాలలో చిర్నవ్వులు చూశావా? ఈ నాలుగేళ్ళలో నువ్వు ఏ ఒక్కరి మొహంలోనైనా ఆనందంతో చురునవ్వు చిందించే ఒక్క పని చేశావా?ఉంటే చూపగలవా?” అంటూ సెల్ఫీ సవాల్ విసిరారు.

దీంతో… ఇంతకాలానికి పాదయాత్రలో పనికొచ్చే పని పక్కాగా చేశారని అంటున్నారు తమ్ముళ్లు! మరి దీనికి వైకాపా నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారనేది వేచి చూడాలి!