టీడీపీ జనసేన కూటమి… సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పిన లోకేష్!

ఏపీలో పాత పొత్తులే కొత్తగా తెర లేచాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా అధికారికంగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదనేది ఏపీ ప్రజలకు, రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలిసిన విషయమే. 2014లో పవన్ జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా చంద్రబాబు మేలుకోరడంలో భాగమనే కామెంట్లు వినిపించాయి.

ఇక 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి జనసేన బయటకు వచ్చి వేరుగా పోటీ చేసింది. అయితే దీని వెనక కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ఎత్తుగడ ఉందని వైసీపీ ఆరోపణలు చేసింది. దానికి బలం చేకూర్చేలా పవన్ పోటీ చేసిన రెండు చోట్ల టీడీపీ అధినేత ప్రచారం చేయలేదు, అలాగే లోకేష్, చంద్రబాబు పోటీచేసిన కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు పవన్ వెళ్లి ప్రచారం చేయలేదు అన్నది చెబుతారు.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల విషయానికొస్తే… రెండేళ్ల క్రితమే జనసేన సూచాయగా చెప్పేసింది. ఇప్పటం సభలో మైకందుకున్న పవన్… వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వమని ప్రకటించారు. అపుడే ఆయన టీడీపీతో పొత్తులకు వెళ్లబోతున్నారు అని అనుకున్నారు. వీటికి బలం చేకూరుస్తూ… ఏడాది నుంచి పవన్ – బాబుల మధ్య చర్చలు జరుగుతున్న పరిస్థితి.

ఈ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పవన్ అసలు విషయం చెప్పేశారు. ఎన్నికలు ఆరునెలల తర్వాత వచ్చినా, రేపే వచ్చినా, టీడీపీ – జనసేనా కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో… ముసుగు తొలగిందనే కామెంట్లు వెలువడ్డాయి.

ఆ సంగతి అలా ఉంటే… జనసేన నుంచి పవనే సీఎం అని అంతా అంటూ వచ్చారు. ఆయన కనబడగానే… సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక వారాహి యాత్రలో సైతం జనసేన అధినేత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటూ అనేకసార్లు ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ సీఎం అభ్యర్థి అని జనసైనికులు అంతా భావిస్తూ వచ్చారు.

కానీ పవన్ కల్యాణ్ ఇలా పొత్తు ప్రకటన చేశారో లేదో అలా కాబోయే సీఎం ఎవరో చెప్పకనే చెప్పేసారు నారా లోకేష్. పొత్తు ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్… ఏపీకి అనుభవశాలి అయిన వారు సీఎం కావాల్సి ఉంది అని ఒక కీలక ప్రకటన చేశారు. జనసేన – టీడీపీ కూటమిలో అనుభవశాలి అంటే కచ్చితంగా అది చంద్రబాబే అవుతారు అన్నది నిజం. అంటే… పరోక్షంగా పవన్ కు ఆ ఛాన్స్ లేదని చినబాబు చెప్పకనే చెప్పారని అంటున్నారు పరిశీలకులు.

అంటే… అన్నీ అనుకూలంగా జరిగి రేపటి రోజున కూటమి గెలిచి అధికారం చేపడితే చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కీలక మంత్రిగా ఉంటారు తప్ప సీఎం అయితే కాలేరనమాట. మహా అయితే డిప్యూటీ సీఎం గా ఉండవచ్చు. ఆ పదవి ఆరో వేలు అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… ఆ పదవి వల్ల పవన్ కు ఒరిగేదేమీ ఉండదనేది తెలిసిన విషయమే.

అంటే… ఈ పొత్తుల వల్ల జనసేనకు ఒరిగేది ఏమీ లేదన్నమాట. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులూ టీడీపీ కేడర్ కాం గా ఉండకుండా చూడాల్సిన బాధ్యత పవన్ తీసుకోవడం మాత్రమే ప్రస్తుత టాస్క్ అన్నమాట.