యువగళం యాత్రలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలోనూ”హలో లోకేష్” కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ యాత్ర గుంటూరు జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో మంగళగిరిలో కూడా “హలో లోకేష్” కార్యక్రమంలో తన క్రష్ లపై లోకేశ్ స్పందించారు. ఇదే సమయంలో తన పెళ్లి గురించి చాలామందికి తెలియని విషయాలు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.
అవును… గుంటూరు జిల్లా మంగళగిరి శివారులోని డాన్ బాస్కో పాఠశాల వద్ద యువతతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ క్రష్ ఎవరు అనే ప్రశ్నను ఎదుర్కొన్నారు. దీనికి సమాధానం ఇచ్చే ముందు… ఆ ప్రశ్న అడిగిన యువతిని ఉద్దేశించి మాట్లాడుతూ… ” చెల్లి.. ముద్దుల మామయ్యతో యుద్ధం ప్రకటించేసింది ” అంటూ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా తనకూ అందరిలాగానే చాలా క్రష్ లు ఉన్నాయని మొదలుపెట్టిన లోకేష్… కాలేజీ టైం లోనూ, స్కూల్ టైం లోనూ చేయాల్సిన వెదవ పనులన్నీ చేసినట్లు చెప్పుకున్నారు! తన ఫస్ట్ క్రష్ పేరు చెబితే… తనను పేటీఎం బ్యాచ్ ట్రోల్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ ఫస్ట్ క్రష్ ఎవరు అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైంది!
ఈ సమయంలో లోకేష్ కు కూడా ఒక టైం లో క్రష్ ఉండేదని… బాలయ్యతో నటించిన ఒక స్టార్ హీరోయిన్ అంటే లోకేష్ కు క్రష్ అని అప్పట్లో గాసిప్స్ హల్ చల్ చేసేవని అంటున్నారు! అయితే తన క్రష్ విషయం చెబితే ట్రోల్స్ చేస్తారని లోకేష్ చెప్పడం గమనార్హం!
ఆ సంగతి అలా ఉంటే… నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో ప్రేమ వ్యవహారం గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బ్రాహ్మణితో ప్రేమ విషయంపై యువత నుంచి మరో ప్రశ్న ఎదుర్కొన్న లోకేష్… బ్రాహ్మణితో పెళ్లి ప్రతిపాదన మొదటగా ఎవరు తీసుకుని వచ్చారనే విషయంపై స్పందించారు. బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆయన తెలిపారు. అనంతరం తన పెళ్లి ప్రతిపాదన గురించి మరింత వివరంగా వివరించారు లోకేష్.
ఇందులో భాగంగా… “ఇంట్లో అమ్మా నాన్న వెకేషన్ కు వెళితే.. వాళ్లప్పుడు చెప్పారు. ఇట్లనుకుంటున్నాం.. నీ అభిప్రాయమేంటని. ఇక నా అభిప్రాయం మీకు తెలుసు కదా.. సో వాళ్లు ముందల ప్రతిపాదించారు.. ఎస్ అన్నాను. బ్రాహ్మిణి కూడా ఒప్పుకుంది. అలా జరిగిపోయింది.. థాంక్యూ” అని నవ్వుతు నారా లోకేష్ తన పెళ్లి కహానీ చెప్పుకొచ్చారు.