ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని కాపాడుకోవడం ఒక సంకటమైతే సొంత నియోజకవర్గం కుప్పంలో పరువు నిలబెట్టుకోవడం ఇంకొక కష్టంగా మారింది. 2019 ముందు జరిగిన ఎన్నికల వరకు దేంట్లోనూ కుప్పంలో చంద్రబాబు నాయుడుకు మెజారిటీ తగ్గలేదు. ఎంతో కొంత పెరుగుతూనే వస్తోంది. కానీ గత ఎన్నికల్లోనే ఊహించని విధంగా తగ్గిపోయింది. ఒక రౌండ్లో వైసీపీ అభ్యర్థి ముందంజలోకి వెళ్లారు కూడ. ఆ పరిణామం చూసి టీడీపీ శ్రేణుల గుండెలు గతుక్కుమన్నాయి. 30 వేలకు పడిపోయింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇదే ఆయనకు అత్యల్ప మెజారిటీ అంటున్నారు. ఈ ఊపులోనే అక్కడ పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉన్నపళంగా కుప్పంను మున్సిపాలిటీని చేశారు.
శ్రేణులు పెద్దఎత్తున వైసీపీలోకి మైగ్రేట్ అయ్యాయి. ఇంకో ఏడాది ఇలాగే సాగితే కుప్పం చంద్రబాబు చేయి జారిపోవడం ఖాయం అన్నారు పరిశీలకులు. దీంతో లోకేష్ బాబు రంగంలోకి దిగారు. తండ్రి అడ్డాకు రిపేర్లు చేస్తానంటూ ముందగుడు వేశారు. కుప్పంలో ఉన్న ప్రతి కార్యకర్తతో, నాయకుడితో లోకేష్ ఇంటరాక్ట్ అవుతారని, వారిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపుతారని, పార్టీని వీడిన నాయకులను సైతం వెనక్కు తీసుకొచ్చే మంతనాలు జరుపుతారని గొప్పలు చెప్పారు. మరి ఇవన్నీ జరిగాయో లేదో తెలియదు కానీ కుప్పంలో పరిస్థితి మారలేదని మాత్రం అర్థమవుతోంది. ఇందుకు నిదర్శనమే పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులు దొరక్కపోవడం.
కుప్పం పరిధిలో ఎన్నికలు చివరి దశలో జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీలో పాగా వేయడానికి పెద్దిరెడ్డి పక్కా స్కెచ్ వేసి పెట్టుకున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలిష్ఠం చేసి శ్రేణుల సంఖ్యను గణనీయంగా పెంచారు. దీంతో చాలామంది వైసీపీ తరపునే నామినేషన్లు వేయడానికి ఆసక్తిగా ఉన్నారట. తెలుగుదేశం నుండి పోటీలోకి దిగడానికి ఔత్సాహికులు కరువయ్యారట. చంద్రబాబు సొంత ఇలాకాలో ఇలాంటి పరిస్థితి కనిపించడం దారుణమైన పరిణామమే అనాలి. దీంతో అనుచరులను అలర్ట్ చేసిన ఆయన గెలిచేది లేనిది తరవాత సంగతి ముందు పోటీకి అభ్యర్థులను వెతకండి చాలు అంటున్నారట. మరి కుప్పంను కాపాడేస్తాడని లోకేష్ గురించి టీడీపీ శ్రేణులు చెప్పిన గొప్పలన్నీ ఏమయ్యాయో మరి.