స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ కోసం ఆయన తరుపున న్యాయవాదులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే… కోర్టు వెలుపల దగ్గుబాటి పురందేశ్వరి కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో గట్టిగా జరుగుతుంది. ఎంతలా అంటే… లోకేష్ ని అమిత్ షా ముందుకు తీసుకెళ్లేంతగా!
చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడిపీ నేతలు, కార్యకర్తలు ఎంతగా కలతచెందారు, ఎంతగా ఆందోళన చెందారనే సంగతి కాసేపు పక్కనపెడితే… అంతకంటే కచ్చితంగా ఒక పైసా వంతైనా పురందేశ్వరి ఎక్కువగా టెన్షన్ పడ్డారని అంటుంటారు పరిశీలకులు. సెప్టెంబర్ 9న ఉదయం బాబు అరెస్ట్ అవ్వగానే ఇంకా సగం ప్రపంచానికి తెలియకముందే ఆమె ఆ విషయాన్ని ఖండించారు! ఆ విషయంలో ఆమెకు అరెస్ట్ మినహా మరేవిషయామూ తెలిసి ఉండకపోవచ్చు… అయినా సరే ఆమె ఖండించారని అంటుంటారు!
ఈ క్రమంలో కోర్టులో ఎలాగూ పనవ్వడం లేదు.. రాజకీయంగా ఏమైనా ప్రయత్నిద్దాం అనుకున్నారో ఏమో కానీ… ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ కావడంతో పెద్దమ్మ ముఖంలో నవ్వు కనిపించింది. ఈ సందర్భంగా పురందేశ్వరి ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇంకా ఎవరికైనా పురందేశ్వరీ బీజేపీ మనిషేనా అనే అనుమానాలుంటే అవన్నీ నివృత్తి అయిపోయే ట్వీట్ అది అని అంటున్నారు.
“రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు గురించి అమిత్ షాకు లోకేష్ వివరంగా చెప్పారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనే వాళ్లు ఇప్పుడు చెప్పండి! మీరంటున్నది నిజమైతే లోకేష్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తారా?” అని ట్విట్టర్ వేదికగా పురందేశ్వరి ప్రశ్నించారు. కాసేపు వాస్తవమే అనుకుంటే… ఈ ఒక్క ట్వీట్… పురందేశ్వరి టీడీపీ అధికార ప్రతినిధి అనే విమర్శలకు బలం చేకూర్చిందని అంటున్నారు పరిశీలకులు.
కారణం… చంద్రబాబు అరెస్ట్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు అరెస్ట్, తదనంతర పరిణామలపై చాలా సేపు చర్చించారు.. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనే వాళ్లు ఇప్పుడు చెప్పండి! మీరంటున్నది నిజమైతే లోకేష్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తారా? అని పురందేశ్వరి ట్వీటుండాలి. అలా కాకుండా… ఎత్తుకోవడం ఎత్తుకోవడమే… “రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు గురించి..” అని అన్నారు పురందేశ్వరి.
దీంతో… జాతీయ అధికార పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని ఎలా అంటారనే ప్రశ్న ఉత్పన్నమైంది. కారణం… ఈ కేసు మొదలుపెట్టింది జాతీస్థాయి విచారణా సంస్థలే. ఆ విషయం పురందేశ్వరికి తెలియక పోయినా… కేంద్ర హోం శాఖా మంత్రిగా అమిత్ షా కు తెలిసే ఉంటుందనుకోవాలి. అయినప్పటికీ… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ శాఖకు చీఫ్ గా ఉన్న పురందేశ్వరి… ఇది కక్ష సాధింపు చర్య అని ఎలా చెబుతారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న!
ఈ కారణాలతో… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.. బాబు అవినీతికి పాల్పడ్డారా.. లేదా.. అనేది న్యాయస్థానం తేలుస్తుంది. కానీ ఈలోపే పురందేశ్వరి టీడీపీ వాదనను వకల్తా పుచ్చుకోవడం ద్వారా.. ఆమె టీడీపీ స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు బలం కలిగించినట్టు కాదా అనేది మరో ప్రశ్న. ఏది ఏమైనా.. ఎవరి రాజకీయాలు, ఎవరి బందుత్వాలు ఏమైనా… జనం మాత్రం అన్నీ గమనిస్తున్నారనే విషయం అంతా గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు విశ్లేషకులు!