పాదయాత్రపై నారా లోకేష్‌కి ఇంట్రెస్ట్ పోయిందా.?

అత్యంత ఆర్భాటంగా ప్రారంభమైంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర.! దురదృష్టం, ఈ పాదయాత్ర కారణంగానే నందమూరి తారకరత్న ప్రాణాలు కోల్పోయాడు. అంతకు మించి, ‘యువగళం’ పాదయాత్ర వల్ల ఒరిగిందేమిటి.? అని వెనక్కి తిరిగి చూసుకుంటే, టీడీపీ అభిమానులకి ఏమీ కనిపించడంలేదు.

మరోపక్క, పాదయాత్ర జరిగిన నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు కొందరు ఆర్థికంగా చితికిపోయారట. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పుణ్యమా అని కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు నారా లోకేష్.. యువగళం పాదయాత్ర నుంచి. తిరిగి పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలే లేవంటూ రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

వైసీపీ ఆరోపణల సంగతి తర్వాత.. అసలంటూ, టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు.? అను నిత్యం వందలాది కార్యకర్తల్ని, జనాన్ని ‘యువగళం’ పాదయాత్రకు తరలించడమంటే టీడీపీ నేతలకు కత్తి మీద సాములా మారిపోతోంది. గతంలో పాదయాత్రల పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. కోట్లు గుమ్మరించాల్సి వస్తోంది.. అయినాగానీ, జనాన్ని ఎక్కువ సేపు ఆయా రాజకీయ కార్యక్రమాల్లో వుంచలేకపోతున్నారు రాజకీయ నాయకులు. నారా లోకేష్‌ పాదయాత్ర విషయంలో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మరెలా.? పాదయాత్ర కొనసాగిస్తే, ఆర్థికంగా మరింత నష్టం. కొనసాగించకపోతే పరువు పోతుంది.

పెద్ద కష్టమే వచ్చింది టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి. నారా లోకేష్ పెద్దగా కష్టపడేదేం లేదు. పాదయాత్రలంటే జస్ట్ టైమ్ పాస్ నడక మాత్రమే.. అన్న అభిప్రాయం లేకపోలేదు.