పవన్ ఇప్పట్లో సీఎం కానట్లే.. క్లారిటీ ఇచ్చిన లోకేష్!

పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి ఇంతకాలం అయినా ఇప్పటికీ వ్యవహారం అయోమయ్యంగానే ఉన్న పరిస్థితి! దానికి కారణం.. ఏ సామాజిక వర్గాన్నైతె బలంగా నమ్ముకుని రంగంలోకి దిగారో.. అక్కడి నుంచే పూర్తి మద్దతులేక ఇలాఉంది పరిస్థితి అని కొందరు అంటుంటే… పవన్ నుంచి ప్రజలకు క్లారిటీ లేకే పరిస్థితి ఇలా ఉందని మరికొందరు అంటున్నారు! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా పవన్ సీఎం వ్యవహారం తెరపైకి వచ్చింది!

పవన్ ఎక్కడ సభ పెట్టినా.. అక్కడకొచ్చిన జనసైనికులు, అభిమానులు “సీఎం.. సీఎం” అంటూ అరుపులతో హోరెత్తిస్తుంటారు. పవన్ సీఎం కావాలని జనసైనికులతో పాటు కాపు సామాజిక వర్గం బలంగా కోరుకుంటోంది. ఇంతకు మించి గొప్ప అవకాశం రాదనేది వారి అభిప్రాయం! అయితే… టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం అది ఇప్పట్లో జరిగేపని కాదని తాజాగా నారా లోకేష్ స్పష్టం చేశారు!

అవును… యువగళం పేరిట చేస్తున్న పాదయాత్రలో మాట్లాడిన లోకేష్.. ఈసారి చంద్రబాబు అయిదేళ్ళు కాదు వరుసగా పదేళ్ళు ఏపీకి సీఎంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని.. అంతలా వైసీపీ వారు ఏపీని నాశనం చేశారని చెప్పుకొచ్చారు! ఆలెక్కన 2024 నుంచి 2034 వరకూ చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు లోకేష్!

మరి ఈ లెక్కన చూసుకుంటే… టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి దిగితే… మరి పవన్ సీఎం అయ్యేది ఎప్పుడు? 2034 తర్వాతే పవన్ కు ఆ ఛాన్స్ అని టీడీపీ ఫిక్సయితే.. అప్పటికి చినబాబు రెడీగా ఉంటారు కదా! అంటే… జనసైనికులు కోరుకుంటున్నట్లుగా పవన్ సీఎం అవ్వాలంటే.. ఒంటరిగానే పోటీచేయాలన్నమాట! అలాకానిపక్షంలో… పవన్ కు సీఎం ఛాన్స్ ఇప్పట్లో లేనట్లే!!