తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌కి న్యాయస్థానంలో ఊరట లభించింది. అయితే, ఆయనకు బెయిల్ దక్కలేదు. దాంతో, సగం ఊరట.. అనుకోవాల్సిందే.!
నారా లోకేష్‌ని అరెస్టు చేసే ఉద్దేశ్యం లేదనీ, నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తామని ఏపీ సీఐడీ తరఫున, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. రాజధాని అమరావతికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
త్వరలో నారా లోకేష్ అరెస్టు అవమబోతున్నారంటూ వైసీపీ నేతలు చెబుతున్న దరిమిలా, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అరెస్టు భయంతోనే నారా లోకేష్ ఢిల్లీకి పరిమితమైపోయారు గత కొద్ది రోజులుగా. నేటి నుంచి యువగళం పాదయాత్రని పునఃప్రారంభించాల్సి వున్నా, దాన్ని మళ్ళీ వాయిదా వేసుకున్నారు లోకేష్.
తండ్రి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, న్యాయవాదులతో చర్చించేందుకోసం, జాతీయ నాయకులతో చర్చించేందుకోసం.. అంటూ, ఢిల్లీలోనే నారా లోకేష్ కాలం గడిపేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఏపీ సీఐడీ బృందం, నారా లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి పయనమయినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్నాక, లోకేష్ విచారణకు హాజరు కావాల్సి వుంటుంది. విచారణ అనంతరం పరిస్థితుల్ని బట్టి ఏపీ సీఐడీ తగు చర్యలు తీసుకుంటుంది.
అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం తప్ప, నారా లోకేష్‌కి పూర్తి ఊరట లభించలేదన్నమాట.