విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్షకు అన్ని పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం విశాఖ చేరుకుని, పల్లా శ్రీనివాస్‌కు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. 30 వేల మంది ప్రత్యక్షంగా,లక్ష మంది పరోక్షంగా ఆధారపడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అంటే కేంద్రానికి లాభనష్టాల వ్యవహారమే కానీ.. ఆంధ్రులకు విశాఖ ఉక్కు అంటే ప్రాణమని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి జగన్ ప్రభుత్వం ఏం సాధించిందని లోకేష్ ప్రశ్నించారు. గాడిదలు కాస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. బుల్లెట్ లేని గన్.. జగన్ అంటూ… నొక్కితే నీళ్లు బయటకు వస్తున్నాయన్నారు.
జగన్ తల్లి విజయలక్ష్మీని ఓడించారు కాబట్టి విశాఖపై కక్ష తీర్చుకోవాలనే ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరణకు సహకరిస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌లో ట్వీట్ రెడ్డిగారు ఓ ప్రశ్న అడగడంతో వారి రహస్య ఒప్పందం బయటపడిందని పరోక్షంగా విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ భూముల విలువ దాదాపు రూ.2లక్షల కోట్లు ఉంటుందని దొడ్డిదారిన వాటిని కొట్టేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని లోకేష్ ఆరోపించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా… టీడీపీ హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. అంతేకాదు…వచ్చే 3, 4 విడతల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేయకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు.