Lokesh – Jagan: “చట్టం ముందు దోషిగా నిలబడతారు”- జగన్‌పై లోకేశ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు జగన్ దోషిగా నిలబడక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.

లోకేశ్ తన పోస్ట్‌లో, “అమ‌రావ‌తిపైనా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పైనా క‌క్ష ఇంకా తీర‌లేదా?” అని ప్రశ్నించారు. తమిళనాడులోని ఒక వీడియోను తీసుకువచ్చి, అమరావతిలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేయించారని ఆయన మండిపడ్డారు. అమరావతి అందరిదని, ఇక్కడ వివక్షకు తావు లేదని లోకేశ్ స్పష్టం చేశారు. “ఇది బౌద్ధం ప‌రిఢ‌విల్లిన నేల‌ అనీ, కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీత‌మైన ఆత్మీయ బంధంతో ప్ర‌జ‌లు క‌లిసిమెలిసి ఉంటారు” అని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల కుంపట్లు, మతాల మధ్య మంటలు రేపి చలి కాచుకునే జగన్ రెడ్డి కుతంత్రాలకు కాలం చెల్లిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కులాల కలహాలు రేపే కుట్రలు అమలు చేసిన కిరాయి మూకల ఆటను చట్టం కట్టిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ తప్పుడు ప్రచారం వెనుక ఉండి నడిపిస్తున్న జగన్ రెడ్డి చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదని లోకేశ్ పునరుద్ఘాటించారు.

Public Reaction On CM Chandrababu Comments On Ys Jagan || Ap Public Talk || Pawan Kalyan || TR