జనసైనికుల కొత్త టెన్షన్… అనుభవజ్ఞుడైన తండ్రికి పుట్టిన కొడుకు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటంతో పవన్ కు ఆవేశం వచ్చింది! ములాకత్ అనంతరం టీడీపీ – జనసేన పొత్తును అధికారికంగా ప్రకటించారు. పైగా అది తాను అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కూడా చెప్పే సాహసం చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో 2014లో చంద్రబాబు “సీనియారిటీ”కి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఇది కూడా అన్ కండీషనల్ సపొర్ట్ అని “తమ్ముడు” లోకేష్ ప్రకటించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలో ఉన్న మంజీరా హోటల్‌ లో “తెలుగుదేశం- జనసేన పార్టీల సమన్వయ కమిటీ” తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా 6 అంశాల అజెండా, మూడు అంశాల తీర్మానాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇరువైపులా 14 మంది నాయకులతో జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైకందుకున్న పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం చినబాబు వాటికి కొనసాగింపుగా మరికొన్ని మాటలు చెప్పారు. ఇందులో భాగంగా… పవన్.. తనకూ చంద్రబాబుకూ ఉన్న సంబంధం రాష్ట్రాభివృద్ధి – అందుకు ఉపయోగపడుందని భావిస్తోన్న “అనుభవం” అని చెప్పుకొచ్చారు.

2014 ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్.. టీడీపీకి “అన్ కండీషనల్” గా మద్దతు ఇచ్చారని లోకేష్ చెబుతున్నారు. అది బాబు “అనుభవం” వల్ల ఇచ్చానని పవన్ ప్రకటించారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆ అనుభవం వల్ల 2014లో ఏపీకి ఒరిగిందేమిటనేది మాత్రం ఇద్దరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… 2014లో చంద్రబాబు పాలనపై ఇప్పటివరకూ మూడు కేసులు రన్నింగ్ లో ఉన్నాయి.

వాటిలో ఒకటి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన మెంట్ కేసు. వీటిలో ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోపక్క ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంలో విచారణలో ఉంది. కోర్టు సెలవులు అయిన తర్వాత వాటిపై విచారణ జరగనుంది.

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే… చంద్రబాబు అనుభవం వల్లే 2014లో మద్దతు ఇచ్చానని పవన్ చెబుతున్నారు. సరే మొదటిసారి నమ్మి మోసపోయారేమో అని కాసేపు అనుకుంటే… 2019లో ప్రజలు టీడీపీకి ఇచ్చిన మ్యాండేట్ చూసైనా బాబు 2014 తర్వాత ఎలా పరిపాలించారనే విషయంపై ఒక క్లారిటీ రావాలి. ఆయన చెబుతున్న “అనుభవం” అనే మాటలో నిజాయితీ ఉంటే…! పైగా వైసీపీతో తనకు విధానపరమైన విభేదాలే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

2014 ఎన్నికల ముందే పవన్ కి జగన్ లోని విధానాలు తెలిసిపోయాయా.. 2019 ఎన్నికలవరకూ ప్రతిపక్షంలో ఉన్న జగన్ పాలనను పవన్ అంతకముందు చూసే అవకాశం లేదు కదా! అయినప్పటికీ తాను సీఎం అవుతానని చెప్పే ధైర్యం లేని పవన్… “జగన్ సీఎం అవ్వడు ఇది శాసనం” అని చెప్పిన మాటలు ఏ ఉద్దేశ్యంతో చెప్పినట్లు అనే విషయం ప్రజలు గ్రహించలేరనుకుంటే… పవన్ కంటే అజ్ఞాని మరొకరు ఉండకపోవచ్చూ!

ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీపీ క్లిష్టపరిస్థితుల్లో ఉంది! అయితే… దాన్ని రాష్ట్రానికి ఆపాదించేపనికి పూనుకుంటున్నారు పవన్! రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని.. అందుకే తాను టీడీపీకి మద్దతు ఇస్తున్నానని… చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం అని చెబుతున్నారు. ఇక్కడ జనసైనికులు నమ్మితే నమ్మొచ్చు కానీ… సాధారణ ప్రజానికం పవన్ కు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.

సీఎం అవ్వడానికి అనుభవమే కొలమానం అయితే… నాడు ఇప్పుడు జగన్ కంటే బాగా పాలించారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్న వైఎస్సార్ తో.. బాబుతో సమానమైన అనుభవం ఉన్న వైఎస్సార్ తో.. పైగా వెన్నుపోట్లను, దొడ్డిదారిని కాకుండా కష్టపడి ఎదిగిన వైఎస్సార్ తో నాడు పవన్ ఎందుకు విభేదించినట్లు? అసలు సర్పంచ్ గా కూడా అనుభవం లేని పవన్… అధికారంలోకి వస్తానని, సీఎం అవుతానని చెబుతూ పార్టీని ఎందుకు పెట్టినట్లు… ఎవరు పెట్టమన్నట్లు.. ఎవరు పెట్టించినట్లు..?

నాడు నందమూరి తారకరామారావుకి ఏ అనుభవం ఉందని ప్రజలు ఎన్నుకున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కి ఏ అనుభవం ఉందని ఆ స్థాయిలో ప్రజలు అందలం ఎక్కించారు. వయసు రీత్యా చూసినా పవన్ కంటే చిన్నవాడైన జగన్ ని ప్రజలు ఎలా నమ్మారు. ఏ అనుభవం ఉందని చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి నాడు సీఎం అభ్యర్థిగా పోటీచేశారు.. ఏ అనుభవం ఉందని కేంద్రంలో మంత్రి అయిపోయారు! ఇక్కడ కావాల్సింది అనుభవం కాదు… కమిట్ మెంట్, ప్రజాభిమానం, ప్రజాధరణ!

అవి సినిమాల్లో పుష్కలంగా ఉన్న పవన్ కి అసలు ప్రపంచంలో లేదనేది గ్రహించి… సైకిల్ చాటున గట్టెక్కేద్దామని చూస్తున్నారా.. లేక, వైసీపీ నేతలు చెబుతున్నట్లు… జనసేన అనేది చంద్రబాబు పెట్టిన “స్టాండ్ బై కంపెనీ” అని కన్ ఫాం చేసేస్తున్నారా? ఈ సమయంలో… జనసైనికులకు మరో టెన్షన్ కూడా ఉందని అంటున్నారు. అదేమిటంటే… ఒకవేళ చంద్రబాబు ఎన్నికల సమయానికి కూడా బయటకు రాకపోతే… “అనుభవజ్ఞుడైన తండ్రికి పుట్టిన కొడుకు” అనే ట్యాగ్ లైన్ తో లోకేష్ నే ముందుపెట్టి రాజకీయాలు చేస్తారా అని! ఏమో… ?

@AkBigNews Pawan Kalyan and Nara Lokesh