టీడీపీ అధికారంలోకి రాకపొతే… లాజిక్ మరుస్తున్న లోకేష్!

ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఫుల్ బిజీగా ఉన్న నారా లోకేష్ ప్రజలకు వరాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ హామీ నిలబెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు అంటూ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో కార్యకర్తలకు స్పెషల్ ఆఫర్ ప్రకటించడంతో… లాజిక్ మరుస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో నడుస్తున్న లోకేష్… తమ్ముళ్ళకు బంపరాఫర్ ఇచ్చారు. ముత్తుకూరులో మైకందుకున్న లోకేష్… కేసులకు ఎవరూ భయపడద్దని అన్నారు. రాబోయే తెలుగుదేశంపార్టీ ప్రభుత్వమే కాబట్టి కేసుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇస్తూ ధైర్యం చెప్పారు. అంతవరకూ చెప్పి ఆపితే తన గొప్పతనం ఏముందని భావించారో ఏమో కానీ… ఎవరిపై ఎక్కువ కేసులు నమోదైతే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు.

పోరాటమంటే ఎలాగుండాలో కూడా లోకేష్ వివరించే ప్రయత్నం చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికి 67 కేసులు నమోదయ్యాయని.. తాడిపత్రి మున్సిపాలిటిలోని ఒక్కో టీడీపీ కౌన్సిలర్లపై కనీసం 24 కేసులు నమోదైనట్లు వివరించిన లోకేష్… పోలీసులు ఎన్నికేసులు నమోదుచేస్తున్నా అరెస్టులు చేస్తున్నా వాళ్ళెవరు వెనక్కు తగ్గకుండా పోరాటం చేస్తునే ఉన్నట్లు లోకేష్ తెలిపారు. పోరాటమంటే అలాగ ఉండాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కళ్ళు పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో… లోకేష్ మోటివేషన్ మామూలుగా లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ… ఇక్కడే లోకేష్ ఒక లాజిక్ మరిచిపోతున్నరని అంటున్నారు విశ్లేషకులు. లోకేష్ మరిచిపోయినా పర్లేదు కానీ… ఈ విషయం విని ఎమోషనల్ అయిపోవడానికి సిద్ధపడుతున్న కార్యకర్తలు మాత్రం కచ్చితంగా ఆ లాజిక్ మరిచిపోకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఆ లాజిక్ ఏమిటంటే… తీరా చేసి 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే పరిస్థితి ఏమిటి? అని!

ఒకవేళ రాబోయే ఎన్నికల్లో కూడా వస్తున్న సర్వే ఫలితాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తే.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి? లోకేష్ ఆఫర్ చేస్తున్న నామినేటెడ్ పదవి రాకపోగా… జీవితం మొత్తం నాశనం అయిపోతుంది కదా? లోకేష్ బాబు మాటవిని అయినదానికీ కానిదానికీ కాలుదువ్వి కేసులు మీదేసుకుంటే… బ్రతుకు మొత్తం పోలీస్ స్టేషన్లు, కోర్టుల వెంట తిరగడంతోనే సరిపోతుంది కదా అని హెచ్చరిస్తున్నారు!!