కమ్యూనిస్టు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి మృతి

సీపీఎం సీనియర్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయిధ పోరాట యోధుడు కామ్రేడ్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం మరణించారు. వయస్సు మీద పడడంతో గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంలో తుదిశ్వాస విడిచారు.

శ్రీనివాసరెడ్డి భౌతిక కాయాన్ని కామినేని మెడికల్ కళాశాలకు కుటుంబ సభ్యులు అప్పగించారు. 1962 లో సీపీఎం పార్టి నుంచి నకిరేకల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయుధ తెలంగాణ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పెత్తందార్ల దోపిడిని ఎదురించి రజకార్ల పై తిరుగుబాటు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆనాటి నుంచి కూడా ఒక సామాన్యునిగానే ఆయన జీవించారు. శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి, సీపీఎం నాయకులు రాఘవులు, తమ్మినేని వీరభద్రం, బొంతల చంద్రారెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు.