మరో పేరు మార్పు వివాదం.! ఎందుకీ రగడ.?

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై వివాదం జరిగితే అందులో కాస్తో కూస్తో అర్థం వుంది. కానీ, ప్రభుత్వాసుపత్రి పేరు మార్చితే అందులో తప్పేముంది.? పైగా, దానికి వైఎస్సార్ అని పేరు పెట్టలేదు కదా.!

మహారాజా పేరుతో వున్న ప్రభుత్వాసుపత్రి పేరుని, ‘ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి’ అని మార్చితే, అక్కడికేదో పెద్ద నేరం జరిగిపోయినట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నానా యాగీ చేశాయి. విజయనగరం జిల్లాలో జరిగిన వ్యవహారమిది. అధికార వైసీపీ ఏం చేసినా అది తప్పే అన్నట్లు టీడీపీ వ్యవహరిస్తుండడమే అన్ని అనర్ధాలకీ కారణం.

రాజకీయాల్లో రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. వైసీపీ అయినా, టీడీపీ అయినా.. ఇంకో పార్టీ అయినా చేసేది అదే. కానీ, కేవలం రాజకీయం తప్ప ఇంకేమీ చేయం.. అంటే ఎలా.? ‘ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి’ అనడంలో తప్పేమిటి.? టీడీపీ అధినేత చంద్రబాబు అయినా ఈ విషయమై స్పష్టతనిస్తారా.? ఇవ్వరా.?

గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ప్రతిదాన్నీ వివాదం చేయడం విపక్షాలకు ఫ్యాషన్ అయిపోయింది. విపక్ష్యాల్ని ర్యాగింగ్ చేయడమే రాజకీయం అనుకుంటోంది వైసీపీ. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి అంటే.. దానికో చరిత్ర వుంది. విజయనగరం జిల్లాలో ఎవర్ని అడిగినా ఈ విషయం చెబుతారు.

విజయనగర సామ్రాజ్యాధిపతులకు సంబంధించి కొన్ని గుర్తులు ఇంకా అలాగే వున్నాయి. మహారాజా పేరుతో విద్యా సంస్థలూ వున్నాయ్. అలాగే ఆసుపత్రి కూడా.! ఆ ఆసుపత్రి పేరులోంచి ‘మహారాజా’ని తొలగించడం కేవలం వివాదం కోసమే అయితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఏదిఏమైనా, రాష్ట్రంలో అభివృద్ధి తప్ప, నానా రకాల వివాదాల గురించిన చర్చా జరుగుతోంది.