నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రివర్స్ గేర్.!

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయం ఒకింత విచిత్రంగా కనిపిస్తుంటుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి చాలా కాలం క్రితమే వెళ్ళిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో ఏమంత సంతోషంగా లేరు. అలాగని, వైసీపీని వీడే సాహసమైతే చేయరు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రచ్చ నేపథ్యంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఆయన తాజాగా ఖండించేశారు. తాను వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

మరి, కొన్నాళ్ళ క్రితం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జరిపిన రహస్య భేటీ సంగతేంటి.? అంటే, తూచ్.. అదంతా టీడీపీ మార్కు కుట్ర.. అని అంటున్నారాయన. నిప్పు లేకుండా పొగ రాదు. సీటు కన్ఫామ్ అయితే వైసీపీని వీడి, టీడీపీలో చేరిపోవాలని నల్లపురెడ్డి అనుకున్నారట.

మీడియాకి లీకులు ఇచ్చేది ఆయనే.. ఆ తర్వాత జరిగే రచ్చని ఖండించేదీ ఆయనే. బిల్లుల చెల్లింపులు, అధికారులతో పంచాయితీలు.. ఇలాంటి సందర్భాలన్నిటిలోనూ నల్లపురెడ్డి వ్యూహాలు ఇలాగే వుంటాయ్. ఇప్పుడూ అవే జరుగుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఓ కంట కనిపెడుతూనే వున్నారు.

పార్టీకి నల్లపురెడ్డి వల్ల అదనంగా కలిగే ప్రయోజనమేమీ లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ తెలుసు. కాకపోతే, ఈ వేడిలో నల్లపురెడ్డినీ బహిష్కరిస్తే.. క్యాడర్‌కి తప్పుడు సంకేతాలు వెళతాయని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది.