ప్రణయ్ హత్యలో ఐదుగురే ప్రధాన నిందితులు

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

జులై మొదటి వారంలోనే ప్రణయ్‌ హత్యకు స్కెచ్ వేశారని, హత్యకు కోటి రూపాయలు  డిమాండ్ చేసిన అస్గర్ అలీ చివరకు 50 లక్షలకు ఒప్పందం చేసుకుని బీహార్‌కు చెందిన సుభాష్ శర్మతో ఈ హత్య అమలు చేయించినట్లు తెలిపారు. ఈ హత్య చేయించిన అమృత తండ్రి తిరునగరి మారుతీరావు జులై రెండో వారంలో సుఫారీ గ్యాంగ్‌కు రూ.15 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు.

మిర్యాలగూడలోని ఆటోనగర్ లో కారులో కూర్చొని ఈ హత్యకు ప్రణాళిక రచించారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో కొన్నాళ్లు జైల్లో ఉన్న అస్గర్‌ అలీకి అక్కడే సుభాష్ శర్మతో పరిచయం అయ్యిందని, మారుతీరావు మిర్యాలగూడలో అస్గర్, కరీంలను కలిసినట్లు రంగనాథ్ తెలిపారు.

ప్రణయ్ హత్య కోసం ఒక స్కూటీ వాహనం, మూడు సిమ్‌కార్డులు కొన్నారు. హత్య కోసం అస్గర్ అలీ మూడు ఆయుధాలు కొనుగోలు చేశాడు. మరో పక్క అమృతను అబార్షన్ చేయించుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశారు. డాక్టర్ జ్యోతితో అమృత తండ్రి మారుతీరావు ఈ విషయమై మాట్లాడారు. డాక్టర్ ని అబార్షన్ చేయాలని బెదిరించారు. ప్రణయ్ రిసెప్షన్ కు సెక్యూరిటి కల్పించాం. ఈ మధ్య అంతా మంచిగా ఉంటున్నట్టు నమ్మించడంతో వారు కూడా పోలీసులను సెక్యూరిటి కోెరలేదు. 

జూలై నుంచే ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశారు. ఆగస్టు 9 నుంచి ప్రణయ్ హత్యకు ప్లాన్ మొదలైంది. ఆగస్టు 14నే బ్యూటీ పార్లర్ దగ్గర ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. ప్రణయ్ ఇంటి వద్ద ఈ నెల 22న హత్యకు యత్నించి విఫలమయ్యారు.

సెప్టెంబర్ మొదటివారంలోనూ అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్‌ను చంపాలని ప్రయత్నం చేశారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సెప్టెంబర్ 14 న సుభాష్ శర్మ  మిర్యాలగూడకు వచ్చాడు. సుభాష్ శర్మ రెండు మూడు సార్లు మిర్యాలగూడ వచ్చి వెళ్లాడు. ప్రణయ్ ని సుభాష్ శర్మ చంపిన తరువాత నల్గొండకు వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లాడు.

నాన్నతో అమృత

హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో అస్గర్ అలీ కూడా ఉన్నాడు. ప్రణయ్ హత్య జరిగిన తీరును బారీ మారుతీరావుకు చేరవేశాడు. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులున్నారు. మరో ఇద్దరికి బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అస్గర్ అలీ కి ఐఎస్ ఐతో సంబంధాలున్నాయి.

ఈ కేసులో నయీం ముఠాకు ఎటువంటి సంబంధాలు లేవు. వేముల వీరేషం జనవరిలో ప్రణయ్ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుకుందామని చెప్పాడు. వేముల వీరేషం పై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. రాజకీయ నాయకులకు ఈ కేసుతో సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. అమృత తల్లికి తెలియకుండానే ఈ హత్య చేశారు. వేముల వీరేశాన్ని కూడా విచారిస్తాం. మారుతీరావు భూ దందాలపై ప్రత్యేకంగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. 

ఈ కేసులో ఏ1గా తిరునగరి మారుతిరావు, ఏ2గా సుభాష్ కుమార్ శర్మ, ఏ3 గా అస్గర్ అలీ, ఏ4 గా అబ్దుల్ భారీ, ఏ5గా అబ్దుల్ కరీం, ఏ6గా తిరునగరి శ్రావణ్ , ఏ7గా సముద్రాల శివ గౌడ్ (డ్రైవర్) ఉన్నారు.

ఆగష్టు 22న ఇంటి వద్ద ప్రణయ్‌ హత్యకు విఫలయత్నం చేసిన ఈ నిందితులు చివరికి ఈ నెల 14న ప్రణయ్‌ను హతమార్చారు. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 302, 120(బి) 109, ఆర్‌/డబ్ల్యూ34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదయ్యాయి.