ఇవి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాలు. టిడిపి నేతలతో చంద్రబాబు ప్రతీరోజు టెలికాన్ఫరెన్సు లో మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాన్ఫరెన్సులో అనేక అంశాలపై చంద్రబాబు నేతలకు సూచనలు ఇస్తుంటారు. అదే సందర్భంలో అనేక విషయాలపై ఆదేశాలు కూడా జారీ చేస్తుంటారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అందుకే ఏ రోజుకారోజు తాజా రాజకీయాలపై సమీక్షిస్తుంటారు. అందులో భాగంగానే ఏ పార్టీలను టార్గెట్ చేయాలి ? ఎవరిని వదిలేయాలి ? అనే అంశాలపై టెలికాన్ఫరెన్సులో చర్చకు వచ్చిందట.
అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోడి, తెలంగాణా సిఎం కెసియార్, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయాలని ఆదేశించారట. ప్రత్యర్ధులపై బురద చల్లటంలో తెలుగుదేశంపార్టీకి మించిన పార్టీ మరోటి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు తన వర్గం మీడియాను చంద్రబాబు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అదే బురదచల్లుడు కార్యక్రమాన్ని మరింత పెంచాలని నేతలకు ఆదేశించారు.
అందులో భాగంగానే టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న సీనియర్ నేతల్లో ఒకరికి ఓ ధర్మసందేహం వచ్చిందట. పై ముగ్గురిని టార్గెట్ చేసుకోమని చెబుతున్నారు బాగానే ఉంది మరి పవన్ కల్యాణ్ సంగతేంటని అడిగారుట. దాంతో అడిగిన సీనియర్ నేతపై ఒక్కసారిగా మండిపోయారట. టిడిపికి పై ముగ్గురు మాత్రమే శతృవులని పవన్ కల్యాణ్ కాదని చెప్పారట. మనవాడే కాబట్టి పవన్ గురించి ఎవరూ మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పారట. అంటే చంద్రబాబు తాజా మాటలు వింటుంటే రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ మధ్య పొత్తులుండటం ఖాయమని తేలిసిపోతోంది.
ఇదే విషయాన్ని జగన్ మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసే పోటీ చేస్తారని కాకపోతే విడిపోయినట్లు జనాలను ఇపుడు మోసం చేస్తున్నట్లు నాటకాలాడుతున్నారంటూ చెబుతున్న విషయం అందరూ చూస్తున్నదే. జగన్ చెబుతున్నట్లే తాజాగా చంద్రబాబు చేసిన ఆదేశాలు పొత్తులనే బలపరుస్తోంది. మరి అధికారికంగా ఎప్పుడు కలుస్తారో తేలాల్సుంది.