వైసిపి ప్యాలెస్ ల పార్టీనట..చంద్రబాబు కడుపు మంట

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశాన్ని కూడా చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారు. అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం బైపాస్ కు దగ్గరలో రెండెకరాల స్ధలంలో వైసిపి కేంద్ర కార్యాలయంతో పాటు నూతన ఇంటిని జగన్ నిర్మించుకున్నారు. కార్యాలయంతో పాటు ఇంటి గృహప్రవేశం జరిగింది. ఆ విషయమై టిడిపి నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు ప్రస్తావించారు.

జగన్ తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నట్లుగా అక్కసు వెళ్ళగక్కారు. ప్యాలెస్ ల్లో తప్ప జగన్ నివాసం ఉండలేరంటూ మండిపడ్డారు. హైదరాబాద్, బెంగుళూరు, పులివెందుల్లో లాగే ఇపుడు తాడేపల్లిలో కూడా భారీ ప్యాలెస్ కట్టుకున్నట్లు ఎద్దేవా చేశారు. అందుకనే వైసిపిని ప్యాలెస్ ల పార్టీగా అభివర్ణించారు.

అంతా బాగానే ఉంది కానీ మరి చంద్రబాబు మాటేమిటి ? చంద్రబాబు హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో సుమారుగా 22 వేల చదరపు అడుగుల్లో నిర్మించుకున్న ప్యాలెస్ మాటేంటి ? 22 వేల చదరపు అడుగుల నిర్మాణాన్ని ప్యాలెస్ అంటారా ? లేకపోతే పూరిగుడెసంటారా ? పైగా తన ఇంటి గృహప్రవేశానికి జగన్ చాలామందిని పిలిచారు. మరి తాను నిర్మించుకున్న ప్యాలెస్ లోకి ప్రవేశించేటపుడు చంద్రబాబు ఎవరినీ ఎందుకు పిలవలేదు ?

జగన్ ప్యాలెస్ నిర్మించుకుంటే చంద్రబాబుకెందుకు కడుపుమంట ? కరకట్ట మీద అక్రమ కట్టడంలో చంద్రబాబు నివసిస్తున్న క్యాంపాఫీసులోని సౌకర్యాల మాటేంటి ? చంద్రబాబుకన్నా జగనే నయం. ఎలాగంటే విజయవాడలో జగన్ తనిష్టం వచ్చినట్లు ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబుకు అదికూడా లేదు కదా ? సొంతింటిని హైదరాబాద్ లో కట్టుకున్నారే కానీ విజయవాడ ప్రాంతంలో కాదు కదా ? అందుకనే జగన్ ను ఇన్ కమింగ్ సిఎం అని, చంద్రబాబును అవుట్ గోయింగ్ సిఎం అని వైసిపి నేతలంటున్నది.