ప్రతిపక్ష నేత హామీలివ్వటమేంటి ? అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వాటిని అమలు చేయటమేంటి ? జగన్ ఇస్తున్న హామీలను చంద్రబాబునాయుడు అమలు చేయటం చూస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏపిలో రాజకీయం విచిత్రంగా ఉంది. పాదయాత్ర సందర్భంగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలిచ్చారు. తాను అధికారంలోకి వస్తే అమలు చేయబోయే కార్యక్రమాలనే హామీల ద్వారా ప్రకటించారు. అందులో పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచటం, చేనేత, జాలర్లు తదితర కులాల వారికి పెన్షన్ తీసుకునే వయసును తగ్గించటం, రైతులకు భరోసాగ ఉంటుందని ఏకకాలంలో రుణమాఫీ, క్రాప్ ఇన్య్సూరెన్స్, ట్రాక్టర్లు, ఆటోలకు రోడ్డు పన్ను రద్దు చేయటం ఇలా చాలా హమీలనే జగన్ ఇచ్చారు.
వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకుని, ఆయా వర్గాల అవసరాల మేరకు జగన్ హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను జగన్ ఎంత వరకూ నెరవేర్చగలరు అన్నది వేరే సంగతి. పాదయాత్ర సందర్భంగానే కొందరు కాపులు తమకు బిసిల రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పర్యటిస్తున్నారు. జగ్గంపేట అంటే కాపులకు బాగా పట్టున్న నియోజకవర్గమనే చెప్పాలి. అటువంటి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ వెంటనే కాపుల డిమాండ్ కు నో చెప్పారు.
రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోని కావు కాబట్టి తాను తప్పుడు హామీలివ్వలేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే బిసిలకు ఇబ్బంది లేని విధంగా రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, పోయిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఇస్తున్న హామీలన్నింటినీ చంద్రబాబు ఇఫుడే అమలు చేసేస్తున్నారు. పెన్షన్లు పెంచటం, ట్రాక్టర్లు, ఆటోలకు రోడ్డు ట్యాక్స్ రద్దు, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు రూ 10 వేలు లాంటి హామీలన్నింటినీ జగన్ నుండి చంద్రబాబు కాపీ కొట్టేసి అమలుకు ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. దాంతో జగన్ ఇస్తున్న హామీలను చంద్రబాబు అమలు చేస్తుండటంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.