ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను ఓ కుప్పం తరహా నియోజకవర్గం ఉండాలని చంద్రబాబునాయుడు తాజాగా సెలవిచ్చారు. చిత్తరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీకి వచ్చే మెజారిటీతోనే టిడిపి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలుచుకుంటోందట ప్రతీ ఎన్నికలోను. కుప్పంకు ఈసారి కూడా 70 వేల మెజారిటీ వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.
కాబట్టే కుప్పం తరహా మెజారిటీని అందించే అసెంబ్లీ నియోజకవర్గం ఒకటుంటే ప్రతీ ఎన్నికలోను ప్రతీ లోక్ సభ స్ధానం తెలుగుదేశం ఖాతాలోనే ఉంటుందని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలోను కుప్పం తరహా నియోకవర్గం ఎలాగుంటుందో ఎవరకీ అర్ధం కావటం లేదు.
కుప్పం తరహా అసెంబ్లీ నియోజకవర్గం ఒక్క చిత్తూరు పార్లమెంటులో మాత్రమే సాధ్యమైంది. మళ్ళీ అదే తరహా నియోజకవర్గం అదే జిల్లాలోని తిరుపతి పార్లమెంటులో కూడా లేదు. నిజానికి చంద్రబాబు సొంత జిల్లాలో టిడిపికి తిరుగుండకూడదు. కానీ ఏనాడు ప్రత్యర్ధిపార్టీ మీద ఆధిపత్యం సంపాదించింది లేదు. కాంగ్రెస్ ఉన్నంత కాలం కాంగ్రెస్ దే మెజారిటీ. ఇపుడు వైసిపిదే మెజారిటీ.
కుప్పం అసెంబ్లీ అంటే ఏదో ప్రత్యేక పరిస్దితుల్లో చంద్రబాబుకు మెజారిటీ వస్తోంది. జిల్లాలో చివరన ఉండటం, అభివృద్ధికి నోచుకోకపోవటం లాంటి కారణాలతో ఎవరు కుప్పంను పట్టించుకోలేదు. దాంతో జిల్లాలో సేఫ్ నియోజకవర్గం ఏదంటే చంద్రబాబుకు కుప్పం కనిపించింది. ఏదో మాయచేసి, జనాలను మభ్యపెట్టి ఇంతకాలం గెలుస్తున్నారు. అంతేకానీ సింగపూర్ తరహాలో బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేసి తిరుగులేని మెజారిటీతో గెలవటం లేదు. కాబట్టి కుప్పం లాంటి ప్రతీ పార్లమెంటులోను సాధ్యం కాదని గ్రహించాలి.