చంద్రబాబుకు తలనొప్పిగా తయారైన పుంగనూరు

సొంతజిల్లా చిత్తూరులో  పుంగనూరు నియోజకవర్గం చంద్రబాబునాయుడుకు పెద్ద తలనొప్పిగా తయారైంది.  పుంగనూరులో పోటీ   చేయాలంటేనే టిడిపి నేతలు భయపడిపోతున్నారు.  అదే విషయంలో చివరకు  మంత్రి అమరనాధ్ రెడ్డికి చంద్రబాబునాయుడు భారీ షాకే   ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మంత్రితో సంబంధం లేకుండానే చంద్రబాబు అనూషారెడ్డిని ఎంపిక చేసినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అనూష మంత్రికి మరదలే. అయినా మొదటి నుండి ఆమె అభ్యర్ధిత్వం పట్ల మంత్రి సుముఖంగా లేరట. పోనీ పుంగనూరులో మంత్రినే పోటీ చేయమని చంద్రబాబు అడిగినపుడు పోటీ చేయనని చెప్పారట. గట్టి అభ్యర్ధిని సమన్వయకర్తగా నియమించేందుకు చంద్రబాబు మీటింగ్ పెట్టినపుడు మంత్రి హాజరు కావటంలేదట. దాంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది.

ముఖ్యమంత్రి సొంత జిల్లానే అయినా పుంగనూరు నియోజకవర్గం చంద్రబాబుకు కొరకరాని సమస్యగా మారిపోయింది. ఎందుకంటే, అక్కడి నుండి వైసిపి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డిని ఢీ కొనేందుకు టిడిపిలో ఎవరూ సిద్ధంగా లేరు. జిల్లా నేతలు కూడా పుంగనూరు నియోజకవర్గాన్ని వదిలేసి మిగిలిన వాటి గురించి ఆలోచించమని సలహా ఇచ్చారట. దాంతో చంద్రబాబుకు మండిపోయింది. అప్పటి నుండి పుంగనూరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అప్పటి నుండి తానే సొంతంగా నియోజకవర్గం గురించి ప్లాన్ చేయటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అమరనాధ్ రెడ్డి తమ్ముడి భార్య అనూషారెడ్డిని రంగంలోకి దింపారు. ఈమె గతంలోనే కూడా టిడిపి టిక్కెట్టు కోసం ప్రయత్నించారు.  అందుకే అనూషారెడ్డిని స్వయంగా చంద్రబాబే పిలిపించుకుని మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్య చిత్తూరు జిల్లా నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు హఠాత్తుగా అనూషారెడ్డి టిక్కెట్టు విషయం ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రికైతే ఏకంగా షాకే కొట్టినట్లైంది. మంత్రికి ఇష్టం లేకపోయినా టిక్కెట్టు  ఇస్తున్నట్లు కూడా చంద్రబాబు చెప్పారు.  దాంతో ఇపుడేం చేయాలో అర్ధం కాక మంత్రి అమరనాధ్ రెడ్డి అవస్తలు పడుతున్నారట.