చంద్రబాబుకు సొంత జిల్లాలోనే షాక్

సొంత జిల్లాలోనే చంద్రబాబునాయుడుకు షాక్ తప్పలేదు. పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్ధిగా ఎంపికైన తెర్లం పూర్ణం కేంద్రంగా మొదలైన హై డ్రామాతో చంద్రబాబు బిత్తరపోయారు. దాంతో ఎందుకైనా మంచిదని అభ్యర్ధిని మార్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

ఇంతకీ ఏం జరిగిందంటే, చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో పోటి చేసేందుకు చాలామంది ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే అందరినీ కాదని చంద్రబాబు స్వయంగా తెర్లంపూర్ణంను అభ్యర్ధిగా ఎంపిక చేశారు. జిల్లాలోని అభ్యర్ధులందిరికీ బి ఫారాలు ఇచ్చే ఉద్దేశ్యంతో అందరినీ రమ్మన్నారు.

అందరూ వచ్చారు కానీ పూర్ణం మాత్రం రాలేదు. అభ్యర్ధి కోసం ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. దానికితోడు మొబైల్ కూడా స్విచ్చాఫ్ అనే వచ్చింది. దాంతో అదే విషయాన్ని జిల్లాలోని నేతలు చంద్రబాబుకు చెప్పారు. దాంతో వెంటనే టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకున్న నేతలను అమరావతికి రమ్మంటూ చంద్రబాబు కబురు చేశారు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్ధులు పోటీ నుండి తప్పుకోవటంతో పూర్ణం మాయం వెనుక కూడా ఇదే ప్రచారం జరిగింది.

అయితే ఇక్కడే పెద్ద ట్విస్టు మొదలైంది. గురువారం తెల్లవారే అభ్యర్ధి పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను అనారోగ్యం కారణంగానే ఆసుపత్రికి వెళ్ళానని చెప్పిన విషయాన్ని ఎవరూ నమ్మటం లేదు. అందులోను ఇప్పటికే టికెట్ కోసం మిగిలిన నేతలను అమరావతికి రమ్మనటంతో వారితో చంద్రబాబు భేటీ అవుతున్నారు. విషయం తెలియగానే అభ్యర్ధి కూడా అందరితో పాటు అమరావతి బయలుదేరారని సమాచారం. మరి ఈ హైడ్రామా ఎలా ముగుస్తుందో చూడాలి.