చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే పంచాయితీలు తేలటం లేదు. దాని ఫలితంగా అభ్యర్ధులెవరో చంద్రబాబు తేల్చ లేకపోతున్నారు. దాంతో నేతలందరిలోను అసహనం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివిధ జిల్లాల్లోని నేతలతో చంద్రబాబు సమీక్షలతోనే గంటల తరబడి గడిపేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పంచాయితీలె తేలిపోతున్నా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఎంతకీ తెగటం లేదు.
అటువంటి నియోజకవర్గాల్లో చిత్తూరులోనే నాలుగు నియోజకవర్గాలున్నాయి. రోజుల తరబడి పంచాయితీలు చేస్తున్నా నేతలెవరూ వెనక్కు తగ్గకపోవటంతో సమస్య మళ్ళీ మొదటికి వస్తోంది. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, మదనపల్లి నియోజవకవర్గాల్లోని నేతల మధ్య సయోధ్య కుదరటం లేదు. టికెట్ కోసం మదనపల్లిలో ముగ్గురి నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది.
తిరుపతిలో ఎంఎల్ఏ సుగుణమ్మకు, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ కు మధ్య ఏమాత్రం పడటం లేదు. అందుకనే రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకంటే తనకంటూ ఇద్దరూ పట్టుబట్టి కూర్చున్నారు. సుగుణమ్మ మీద పార్టీలోనే ఎవరికీ సదభిప్రాయం లేదు. పైగా ఆమెపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఇక, శ్రీకాళహస్తిలో తనకు బదులుగా తన కొడుకు సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఎంఎల్ఏ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పట్టుబట్టారు. కానీ సిఎంకేమో సుధీర్ కు కాకుండా ఎస్సీవి నాయుడుకు ఇవ్వాలనుందని సమాచారం.
అలాగే, సత్యవేడులో ఎంఎల్ఏ తలారి ఆదిత్యపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. అయినా సరే టికెట్ తనకే కావాలని పట్టుపట్టారు. ఆదిత్యకు పోటీగా మాజీ ఎంఎల్ఏ హేమలత కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దాంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. మదనపల్లిలో టికెట్ కోసం మాజీ ఎంఎల్ఏ దమ్మాలపాటి రమేష్, సీనియర్ నేతలు రాందాస్ చౌధరి, రమేష్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక్కడ కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక పోతున్నారు. సొంతజిల్లాలో పంచాయితీలు తేల్చేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో ?