టిడిఎల్పీ లీడర్ గా మళ్ళీ చంద్రబాబే…ముగిసిన డ్రామా

టిడిఎల్పీ లీడర్ గా మళ్ళీ చంద్రబాబునాయుడే ఎన్నికయ్యారు. ఫలితాలు వచ్చిన 23వ తేదీ నుండి మంగళవారం వరకూ ఇదే విషయమై రకరకాల డ్రామాలు నడిచాయి. ఫలితాల్లో ఘోర ఓటమి ఎదురవ్వగానే టిడిఎల్పీ లీడర్ గా తాను ఉండలేనని చంద్రబాబు అన్నట్లుగా ఫీలర్లు వచ్చాయి.

చంద్రబాబేమో పదవి లేకుండా ఉండలేరు. అలాంటిది ముఖ్యమైన టిడిఎల్పీ నేత పదవిని ఇంకోరికి అప్పగిస్తారా అనే సందేహం నేతల్లోనే వ్యక్తమయింది. అయితే రెండు రోజుల పాటు అదే ఫీలర్ చక్కర్లు కొడుతుండటంతో నిజమే అనుకుని నలుగురు ఎంఎల్ఏలు రెడీ అయిపోయారు.

బిసిల్లో అచ్చెన్నాయుడు, కమ్మవాళ్ళల్లో బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, కాపుల్లో గంటా శ్రీనివాసరావు టిడిఎల్పీ లీడర్ పదవికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. దాంతో చంద్రబాబు వెంటనే సర్దుకున్నారు. గెలిచిన ఎంఎల్ఏల్లో ఎవరిని నియమించినా పార్టీకి అంతగా ఉపయోగం ఉండదని, చంద్రబాబే ఉండాలని  మరో ఫీలర్ బయలుదేరింది.

ఎప్పుడైతే రెండో ఫీలర్ వచ్చిందో మొదటిది అంతా ఉత్త గ్యాసే అన్న విషయం అర్ధమైపోయింది. దాంతో బుధవారం జరిగిన టిడిఎల్పీ సమావేశంలో చంద్రబాబే టిడిఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తానుండనంటే అందరూ వచ్చి బతిమలాడుకుంటారని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. అయితే ఎవరికి వారుగా రెడీ అయిపోవటంతో వేరే దారిలేక చంద్రబాబే రెండో ఫీలర్ పంపి డ్రామాకు తెరదించాల్సొంచ్చింది.