అబద్ధాలతోనే వైసిపిపై ఎదురుదాడి

మొదటి నుండి కూడా చంద్రబాబునాయుడు నైజమే అంత. ఎదుటివాళ్ళపై అబద్ధాలతో ఎదురుదాడులు చేయటం చంద్రబాబుకు అలావాటే. తాను చెప్పే అబద్ధాలనే ఎల్లో మీడియా తో అందమైన గొడ కట్టించటం ఎలాగో చంద్రబాబు బాగా తెలుసు. తాజా మీడియా సమావేశంలో చంద్రబాబు అధికారపార్టీపై చేసిన ఆరోపణల్లో ఎక్కువ భాగం అబద్ధాలే అన్న విషయం అందరికీ తెలుసు.

చంద్రబాబు చేసిన ఆరోపణల్లో ప్రధానమైనవి ఏమిటంటే తానుంటున్న కరకట్ట నివాసాన్ని ఎందుకు ఖాళీ చేయాలో ప్రభుత్వం చెప్పలేదట. లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమనిర్మాణమని కాబట్టి కూల్చేస్తామని ప్రభుత్వం కొన్ని వందల సార్లు మొత్తుకున్నా చంద్రబాబుకు వినబడలేదు. ప్రత్యేకహోదాపై మాటలు మార్చినట్లుగానే లింగమనేని గెస్ట్ హౌస్ పైన కూడా ఎన్నిసార్లు మాటలు మారుస్తారో చంద్రబాబుకే తెలియదు. ఒకసారి ప్రభుత్వ గెస్ట్ హౌస్ అంటారు. మరోసారి ప్రైవేటు భవనమే అంటారు.

ఇక అసెంబ్లీలో టిడిపికి మాట్లాడే అవకాశమే ఇవ్వటం లేదట. 23 ఎంఎల్ఏలకు ఎంత సమయం ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ సమయమే స్పీకర్ ఇస్తున్నారు. కాకపోతే తమకిచ్చిన సమయాన్ని సమస్యలపై మాట్లాడటం కన్నా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయటానికే ఉపయోగిస్తున్నారు.  పైగా మంత్రులు మాట్లాడుతున్నపుడు చివరకు జగన్ మాట్లాడుతున్నపుడు కూడా టిడిపి ఎంఎల్ఏలు రన్నింగ్ కామెంటరీ చేస్తునే ఉన్నారు. గడచిన వారం రోజులుగా ఇదే పద్దతి. స్పీకర్ వారిస్తున్నా వినటం లేదు. అందుకనే సస్పెండ్ చేశారు.

తాము అధికారంలో ఉన్నపుడు వైసిపి వాళ్ళు గంటల తరబడి మాట్లాడారని చెప్పింది కూడా అబద్ధమే. వైసిపికి అసలు మైక్ ఇచ్చిందే లేదు. జగన్ మాట్లాడటానికి అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి రన్నింగ్ కామెంట్రీ చేయటం, వ్యక్తిగత ధూషణలకు దిగి జగన్ రెచ్చ గొట్టటమే పనిగా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.  

అసెంబ్లీలో చంద్రబాబును ఉద్దేశించి జగన్ కావచ్చు లేదా అనీల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాస్త ఆవేశంగా మాట్లాడుతున్న మాట నిజమే. ఆ విషయంలో వైసిపి జాగ్రత్త పడాలి. టిడిపి హయాంలో జగన్ ను చంద్రబాబు నేరుగా ఏమీ అనకుండానే అచ్చెన్న, బుచ్చయ్య, బోండా, దేవినేని లాంటి వాళ్ళతో తిట్టించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి అబద్ధాలతోనే చంద్రబాబు తన మీడియా సమావేశాన్ని ముగించటం విడ్డూరం.