ఓట్ల కోసం సమాజాన్ని ఎన్ని ముక్కలైనా చేస్తారా ?

అవును చంద్రబాబునాయుడు నైజమదే. ఓట్లేయించుకోవటం కోసం, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. సామాజికవర్గాల్లో ఎన్ని చీలికలైనా తేవటానికి వెనకాడరు. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానన్న హామీ అలాంటిదే. ఎన్నికల్లో హామీలివ్వటం, తర్వాత పక్కనపడేయటం చంద్రబాబు సహజ లక్షణం. అందుకే ఎన్నికల్లో గెలవగానే కాపులను బిసిల్లో చేరుస్తానన్న హామీని పక్కనపడేశారు. సరే తర్వాత జరిగిన రచ్చ, చంద్రబాబు ఆడిన డ్రామాలన్నీ అందరికీ తెలిసిందే. తాజాగా అటువంటి డ్రామాకే మళ్ళీ తెరలేపారు.

రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లను కొల్లగొట్టే విషయంలో చంద్రబాబుకు దారి కనబడటం లేదు. ఆ సమయంలో అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతమంటూ కేంద్రం ప్రకటించింది. నిజానికి కేంద్రానిది కూడా ఓట్ల రాజకీయమనే చెప్పాలి. ఎప్పుడైతే కేంద్రం 10 శాతం ప్రకటించిందో వెంటనే చంద్రబాబుకు బల్బు వెలిగింది. అందులో నుండి 5 శాతం విడిగా తీసి కాపులకు రిజర్వేషన్ అంటూ ప్రకటించేశారు. తన నిర్ణయం న్యాయసమీక్షకు నిలుస్తుందా లేదా అన్నది చంద్రబాబుకు అనవసరం. హామీ ఇచ్చేశామా ? ఓట్లేయించేసుకున్నామా ? అన్నదే చంద్రబాబు కావాల్సింది.

5 శాతం కాపులకంటే కాపుల్లో అందరూ టిడిపికి ఓట్లేస్తారో లేదో అన్న అనుమానం వచ్చినట్లుంది. అందుకనే కాపులకు కేటాయించిన 5 శాతంలో కూడా మళ్ళీ మూడోవంతు కాపు మహిళలకు అంటూ మరో డ్రామా మొదలుపెట్టారు. అంటే బిసిల్లో చేరుస్తానంటూ కాపులను ఊరించారు. తమలో కాపులను కలుపేందుకు లేదని బిసిలు రోడ్డెక్కారు. బిసిల్లో తమను కలపాల్సిందేనంటూ కాపులు ఆందోళనలు చేశారు. మొన్నేమో కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకంటూ కాపులకు కాపేతరుల మధ్య చిచ్చు పెట్టారు. తాజాగా కాపులకు ఇచ్చిన 5 శాతంలో కూడా మళ్ళీ మూడోవంతు మహిళలకన్నారు. అంటే సమాజం, సామాజికవర్గాలు ఎలా కొట్టుకుచచ్చినా చంద్రబాబుకు నష్టంలేదు. తాను మళ్ళీ ముఖ్యమంత్రవ్వటమే చంద్రబాబుకు కావాల్సింది.