తండ్రి, కొడుకులకు గడ్డు కాలమేనా ?

చూస్తుంటే తండ్రి, కొడుకులకు ఒకేసారి గడ్డుకాలం మొదలైనట్లే అనిపిస్తోంది. ఒకవైపు అసెంబ్లీలోను బయట జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాయించేస్తుంటే పనిలో పనిగా బిజెపి నేతలు కూడా అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. అచ్చంగా బిజిపి నేతలే ఆరోపణలు చేస్తే ఏదోలే సరిపెట్టుకోవచ్చు.

కానీ మొన్ననే టిడిపిలో నుండి బిజెపిలో చేరిన మాజీ ఎంఎల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కూడా అవినీతి ఆరోపణలతో వేడెక్కిస్తున్నారు. గడచిన ఐదేళ్ళల్లో నారా లోకేష్ విపరీతంగా అవినీతికి పాల్పడినట్లు ఈ మాజీ టిడిపి నేత మండిపడుతున్నారు.  లోకేష్ ఐటి శాఖ మంత్రిగా చేసినకాలంలో ఆ శాఖలో జరిగిన అవినీతి మొత్తానికి ఆధారాలున్నట్లు సతీష్ తాజాగా చెబుతున్నారు.

లోకేష్ అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్న ఈ మాజీ ఎంఎల్సీ అందుకు తగిన ఆధారాలను రెండు రోజుల్లో జగన్ ను కలిసి అందిస్తానంటూ పెద్ద బాంబే పేల్చారు. ఇదే అంశంపై కేంద్రప్రభుత్వాన్ని కలిసి సిబిఐ విచారణ కూడా అడుగుతానంటున్నాడు.

అసలు లోకేష్ కారణంగానే టిడిపి నష్టపోయినట్లు సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ కారణంగా చాలామంది నేతలు టిడిపిలో ఇబ్బందుల పడుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు లేండి. లోకేష్ ఆధ్వర్యంలో పనిచేయటం ఇష్టం లేకే టిడిపిలో నుండి బయటకు వచ్చేసినట్లు కూడా చెబుతున్నారు.

ఒకవైపేమో చంద్రబాబు భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారంటూ అసెంబ్లీలో జగన్ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ కూడా అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ టిడిపి నేతలు అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే తండ్రి, కొడుకులకు గడ్డుకాలం మొదలైనట్లే ఉంది.