పవన్ అలా… నాగబాబు ఇలా… అదెలా?

జనసేన అధినేత పవన్ కొన్ని విషయాల్లో వాస్తవాల్లో బ్రతుకుతూ.. కార్యకర్తల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ.. సినిమా వేరు నిజజీవితం వేరని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం సీఎం వంటి పెద్ద మాటలు వద్దు.. ఉన్నంతలో కీలకంగా రాజకీయాలు చేసుకుందామని సరిపెడుతున్నారు. కానీ… నాగబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడుతుండటం గమనార్హం.

ఏపీ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్టు అనేది ఎప్పుడూ ఎన్నికల్లో హాట్ టాపిక్కే. అయితే ఉమ్మడి ఏపీలో సంగతి కాసేపు పక్కనపెడితే… విభజత ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పూర్తవ్వడానికి ఒక సువర్ణావకాశం దొరికింది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. ఆ బాధ్యతను తీసుకుంది. ఇంతలోనే చంద్రబాబు రూపంలో పోలవరానికి మరో శాపం ఎదురైంది. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది.

అసెంబ్లీ సాక్షిగా 2018లో పోలవరం పూర్తిచేస్తాము.. రాసుకో జగన్ అని డాంభికాలు పలికారు. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు.. నట్టేట్లో ముంచేశాడే గంగరాజు అన్న చందంగా ఆ ప్రాజెక్టును టీడీపీ హయాంలో పూర్తిచేయలేదు. సరికదా… వెయ్యాల్సినన్ని హోల్స్ వేసేశారని నిపుణులు చెబుతున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో రాసుకోమన్న నాయకుడూ లేడు.. జాతీయ ప్రాజెక్టును చేతుల్లోకి తీసుకుని ముంచేచిన చంద్రబాబూ లేరు!

అయితే ఈ విషయాలు తెలియదో ఏమో కానీ.. పోలవరంపై తాజాగా స్పందించారు నాగబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగునీటితో పాటు వేల కోట్ల ఆదాయ వనరులను అందించే అక్షయ పాత్ర లాంటి పోలవరం ప్రాజెక్టుని ప్రభుత్వం గాలికి వదిలేసిందని నాగబాబు విమర్శించారు. పోల‌వ‌రం నిర్మాణం పూర్త‌యితే ప్ర‌తి ఏడాది ఎంతెంత ఆదాయం వ‌స్తుందో ఆయ‌న లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు. జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం పూర్త‌య్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముంచేచిన అంశాన్ని వ్యూహాత్మకంగా తొక్కిపెట్టారు.

సరే అంతవరకూ మాట్లాడితే పర్లేదు కానీ… ఇక్కడ నాగబాబు ఒక గొప్ప విషయం చెప్పారు. పవన్ కల్యాణ్ తన నాయకత్వంలో పోలవరం కడతారని, ప్రజలు సంతోషంగా ఉంటారని జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి వేములపాటి అజయ్‌ కుమార్ అన్నారు. సబాష్ బాగా చెప్పావంటూ అజయ్‌ ని నాగ‌బాబు అభ‌నందిస్తూ చేతులు క‌లిపారు. దీంతో మరోసారి పవన్ సీఎం వ్యవహారం తెరపైకి వచ్చింది. జనసైనికులను ఇంతకాలం పవన్ – నాగబాబు కలిసి మోసం చేస్తే… ఇప్పుడు నాగబాబు – అజయ్ లు మోసం చేస్తున్నారనే చర్చ మొదలైంది.

తాను సీఎం స్థాయి అభ్యర్థిని కాదు మొర్రో అని పవన్ మొత్తుకుంటుంటే… నిన్నటివరకూ నాగబాబు, ఇప్పుడు నాగబాబు సౌజన్యంతో అజయ్ లు జనసైనికులను ఇంకా వంచించే ప్రయత్నాలే చేస్తున్నారనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా మొదలైపోయాయి. దీంతో జనసేన నుంచి సీరియస్ పాలిటిక్స్ ఎప్పుడు చూడోచ్చో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు!