లోక్ సభకు నాదెండ్ల మనోహర్.?

గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చవిచూసిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, ఈసారి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు వున్నాయట. ఈ మేరకు జనసేన వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్ సభకీ అలాగే, అసెంబ్లీకీ.. ఇలా రెండు చోట్లా పోటీ చేసే విషయంలోనూ నాదెండ్ల మనోహర్, అధినేత పవన్ కళ్యాణ్‌తో చర్చోపచర్చలు జరుపుతున్నారట.

కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనీ, ఆ నియోజకవర్గం పేరు విషయమై మల్లగుల్లాలు నడుస్తున్నాయనీ సమాచారం. పాలకొల్లు నియోజకవర్గంపై జనసేనాని ఫోకస్ పెట్టారన్నది తాజా ఖబర్. అయితే, ఈ విషయమై జనసేన నేతలు పెదవి విప్పడంలేదు.

‘మీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?’ అన్న ప్రశ్న చాలా టీవీ చర్చా కార్యక్రమాల్లో జనసేన నేతలకు ఎదురవుతోంది. సమాధానం చెప్పలేక నానా తంటాలూ పడుతున్నారు జనసేన నేతలు ఈ విషయమై. గాజువాక విషయంలో జనసేనాని కొంత పట్టుదలతోనే వున్నారు.

గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో జనసేనాని పోటీ చేశారు. రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి భీమవరం నియోజకవర్గాన్ని అస్సలు కన్సిడర్ చేయడంలేదట. పొత్తులో భాగంగా బీజేపీ లేదా టీడీపీకి జనసేన ఆ సీటు వదిలేసే అవకాశం వుంది. కాగా, టీడీపీ – జనసేన చర్చల్లోనూ, బీజేపీ – జనసేన చర్చల్లోనూ నాదెండ్ల మనోహర్ లోక్ సభ.. అంశం ఎక్కువగా ప్రస్తావనకు వస్తోందిట.