నాదెండ్ల అతి తెలివి.. అసలు విషయంతప్ప అన్నీ చెప్పారు!

కొంతమంది నాయకులు అధికారంలోకి రావాలని కలలుగంటారు కానీ… అందుకోసం సరైన అవగాహనా, ప్రణాళికలు కలిగి ఉండరని అంటుంటారు. ఫలితంగా రాజకీయ జీవితం అంతా విమర్శలకే సరిపోతుంది తప్ప.. హామీలు ఇచ్చే సాహసం చేయలేరు. ఈ విషయంలో నాదెండ్ల మనోహర్ కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలలో రేగిన అసంతృప్తిని జగన్ ప్రభుత్వం సద్దుమణిగేలా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని (సీపీఎస్) రద్దుచేసి ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలాగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) తీసుకువస్తాం అని జగన్ సర్కారు ప్రకటన చేసింది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ జగన్ కు అభినందనలు తెలిపారు.

అయితే ఈ విషయంలో తమకు జీపీఎస్ ద్వారా అధిక మేలు జరిగినా కూడా మాకు మాత్రం అది వద్దని ఒక వర్గం (సీపీఎస్ ఉద్యోగులు) మాత్రం జగన్ సర్కారు పట్ల విపరీతమైన నిరసన, వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా జీపీఎస్ లాంటి అధిక మేలు కలిగే కొత్త పథకాలు ఏమీ వద్దని… సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకురావాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో తాజాగా వారి నిరసనను మరింత బలంగా తెలిపే కార్యక్రమంలో భాగంగా… ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ ల వద్ద నిరసన కార్యక్రమానికి తెరలేపారు. ఈ క్రమంలో గుంటూరులో జరిగిన నిరసన, ధర్నా కార్యక్రమంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు చేశారు.

అవును… సీపీఎస్ ఉద్యోగుల ధర్నా కార్యక్రమానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్… “అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాం” అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడితో నాదెండ్ల ప్రసంగం ముగిసింది!!

అవును… ఈసారి ఎన్నికల్లో జగన్ సర్కార్ ని గద్దె దింపడమే లక్ష్యం అని చెప్పుకుని తిరుగుతున్న జనసేనకు సంబంధించిన కీలక నేత అయిన మనోహర్… తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యపై ఏం చేస్తుంది? ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని ఇస్తుంది? అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఉన్న సమయం కాస్తా జగన్ సర్కార్ ని విమర్శించడానికే కేటాయించేశారు.

దీంతో సిపిఎస్ ఉద్యోగులను జనసేన తెలివిగా వంచిస్తుందనే కామెంట్లు మొదలైపోయాయి. అలా కాకుండా… తాము అధికారంలోకి వచ్చినా.. లేక, టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినా కూడా కచ్చితంగా సిపిఎస్ రద్దు చేసి తీరుతామనే హామీ ఇస్తారని వారంతా ఆశించారని తెలుస్తుంది. అవసరమైతే ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు మెడలు వంచి అయినా… పవన్ కల్యాణ్ ఈ మేరకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెబితే మరింత విలువ పెరిగేదని అంటున్నారు.

అలా కాకుండా జగన్ ఇచ్చిన హామీని కాదని.. అంతకు మించి ప్రయోజనం కలిగించే హామీని ఇచ్చారని.. అబ్బే అలా కాదు పాత హామీనే అమలు చేయాలని మాత్రం చెప్పేసి వచ్చేస్తే సరిపోతుందా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చేస్తారని, ఇలాంటి విమర్శలు సాధారణ ప్రజలు కూడా డిమాండ్ చేస్తారని… అలా కాకుండా ఈసారి అధికారంలోకి వస్తామని చెబుతున్న పార్టీ కీలక నేతలు కూడా ఆ సాహసం చేయకపోవడం చేతనకానితనమనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం గమనార్హం.