కాదేదీ రాజకీయానికి అనర్హం.! రాజకీయాల్లో అన్నీ ఒకదానితో ఇంకోటి లింక్ అయి వుంటాయి. అదే రాజకీయానికి వున్న ప్రత్యేకత. మునుగోడు ఉప ఎన్నికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ ఏంటి.? ఏమో, ఏదో ఒక మూల వుండే వుంటుందేమో.! లేకపోతే, లేకపోవచ్చు. కానీ, ఎన్నికల ప్రక్రియ అనేది ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందో చెప్పడానికి మునుగోడు ఉప ఎన్నిక ఓ నిదర్శనం.
పోలింగ్ కేంద్రాల వద్ద కొందరు ఓటర్లు, రాజకీయ పార్టీలపై వ్యక్తం చేసిన అభిప్రాయం చూస్తే.. ఓట్లెయ్యడానికి కరెన్సీ నోట్లను రాజకీయ పార్టీలు ఇవ్వకపోతే.. అసలు ఓటర్లు ఎన్నికల్లో ఓట్లెయ్యరేమో అనిపించకమానదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ పెద్దగా ఖర్చు చేసిన సందర్భాల్లేవన్న వాదన అయితే ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
‘అబ్బే, ఆ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు.. అసలు రాష్ట్రంలో విపక్షాలే పద్ధతిగా లేవు.. అదే అధికార పార్టీకి అడ్వాంటేజ్..’ అన్న భావన వుంది. కానీ, స్థానిక ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు గట్టిగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓటుకి ఐదు వేలు పంచినట్లు అధికార పార్టీ నాయకుడొకరు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.
అలా చూస్తే, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో వున్నట్టే లెక్క. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఖర్చు లెక్కలు బాగానే ప్రచారంలోకి వచ్చాయి. తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాతి ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ప్లస్ పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి. కానీ, ఒకవేళ వైసీపీ ముందస్తు ఎన్నికలపై మోజు పడితే మాత్రం.. వచ్చే ఏడాదిలోనే ఏపీలో కూడా ఎన్నికలు రావొచ్చు.
‘ఈసారి మనం గట్టిగానే ఖర్చు చేయాల్సి రావొచ్చు..’ అన్న అభిప్రాయమైతే అధికార పార్టీలో కనిపిస్తోంది. కానీ, ఎవరూ ఆ విషయాన్ని బాహాటంగా చెప్పలేరు, చెప్పకూడదు కూడా.!