నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవడం తెలుగురాష్ట్రాలను కలచి వేసింది. ఆయన హఠాన్మరణం కుటుంబీకుల్లోను, అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శనార్ధం మెహిదీపట్నంలోని ఆయన స్వగృహం వద్ద ఉంచారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, బంధువులు, అభిమానులు కడసారి చూపు కోసం ఆయన నివాసం వద్దకు తరలి వస్తున్నారు. దీంతో హరికృష్ణ ఇంటి వద్ద కడసారి చూపు కోసం జనం క్యూల్లో నిలబడ్డారు.
మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించనున్నారు. హరికృష్ణ రధసారధిగా ఉండి తన తండ్రిని ఊరూరా తిప్పిన చైతన్య రధంలోనే ఆయన్ని కూడా మహా ప్రస్థానానికి తీసుకెళ్లనున్నారు. బుధవారం నుండి రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులు ఆయన నివాసం వద్దకు చేరుకొని నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మహిళా కాంగ్రెస్ నాయకురాలు ములుగు సీతక్క హరికృష్ణ భౌతికకాయాన్ని చివరి సారిగా సందర్శించుకుని తన నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియా ముందు హరికృష్ణతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆమె హరికృష్ణ గురించి ఏం చెప్పారో ఆమె మాటల్లోనే కింద వుంది చదవండి.
నందమూరి హరికృష్ణ గారి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. తెలుగుదేశం పార్టీకే కాకుండా సినీ అభిమానులకు, రాజకీయ అభిమానులకు ఆయన లోటు తీర్చలేనిది. గతంలో టీడీపీలో మేమంతా కలిసి పని చేసాము, ఆయనతో మాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మా ములుగు నియోజకవర్గానికి నిధులు కేటాయించారు. మా ప్రాంతంలో ఉన్న లక్ష్మి నరసింహస్వామి గుడికి సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నారు.
పార్టీలో అనేక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పని చేయడం జరిగింది. ఇవన్నీ మాకు ఆయనతో ఉన్న అనుబంధాలు. ఆయన మరణం చాలా చాలా బాధాకరమైన సంఘటన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చేందుకు మేమంతా తోడ్పాటుగా ఉంటాము. ఈ సందర్భంగా హరికృష్ణ గారికి నివాళులు అర్పిస్తున్నాను అని ములుగు సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఆవేదనకు గురయ్యారు.