అటు ముద్రగడ, ఇటు వంగవీటి.! వైసీపీలో కాక రేపుతున్న ‘కాపు’ రాజకీయం.!

ఇద్దరూ ఇద్దరూ.! ఉభయ గోదావరి జిల్లాల్లో ‘కాపు’ నాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు వుంది మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి. కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధకీ ఒకింత పాపులారిటీ బాగానే వుంది.

ఇప్పుడు ఈ ఇద్దరూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంతవరకు ముద్రగడ పద్మనాభం తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే విషయమై స్పష్టతనివ్వలేదు.

పిఠాపురం నుంచి ముద్రగడను ఎన్నికల బరిలోకి దించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు నిన్న మొన్నటిదాకా వినిపించినా, వైసీపీ ఎంపీ వంగా గీతకు, పిఠాపురం అసెంబ్లీ టిక్కెట్టుని తాజాగా వైఎస్ జగన్ ఖరారు చేయడం గమనార్హం.

దాంతో, ముద్రగడ మీద ఆశలు పెట్టుకున్న వైసీపీ కాపు నేతలు ఒకింత అలజడికి గురయ్యారు. అయితే, ముద్రగడ ఖచ్చితంగా ఎన్నికల బరిలో వుంటారనీ, ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తారని ముద్రగడ అభిమానులు సెలవిస్తున్నారు.

వంగవీటి రాధ విషయానికొస్తే, రాజకీయంగా అస్సలేమాత్రం స్థిరత్వం లేని వ్యక్తి ఆయన. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ.. ఇలా చాలా పార్టీలు మారారాయన. జనసేనతోనూ టచ్‌లోకి వెళ్ళారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా పని చేశారు.

రాధకు టిక్కెట్ ఇవ్వాల్సిందిపోయి, రాధ ఆశిస్తున్న సీటులో అభ్యర్థిని వైసీపీ అధినాయకత్వం ఖరారు చేయడం, వైసీపీలో కొందరు కాపు నేతలకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వంగవీటి రాధకు వేరే నియోజకవర్గం కేటాయిస్తారంటూ వైసీపీలో చర్చ జరుగుతున్న వేళ, ‘వైసీపీని ఓడించడమే లక్ష్యం..’ అని వంగవీటి వ్యాఖ్యానించినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయ్.

అసలంటూ టిక్కెట్ల ఖరారు విషయంలో ఎవరి ‘పెత్తనం’ వుందోగానీ, అంతా కంగాలీ వ్యవహారంలా తయారైందంటూ వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.