వైసీపీలోకి ముద్రగడ.! ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో.!

మాజీ మంత్రి, ‘కాపు’ సామాజిక వర్గ ప్రముఖుడు ముద్రగడ పద్మనాభం త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. ఈ విషయమై వైసీపీ అధినాయకత్వం నుంచి ముద్రగడ పద్మనాభంకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు చేరబోయేది అధికారికం కాబోతోందంతే. నిజానికి, చాలాకాలంగా ఆయన వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారు.

చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమానికి తెరలేపిన ముద్రగడ పద్మనాభం, వైసీపీ అధికారంలోకి రాగానే సైలెంటయిపోయిన సంగతి తెలిసిందే. ముద్రగడ పద్మనాభంపై అప్పట్లో చంద్రబాబు సర్కార్ చాలా హేయంగా ప్రవర్తించిన మాట వాస్తవం. కేవలం చంద్రబాబుని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే.. అన్నట్లు ముద్రగడ, కాపు ఉద్యమాన్ని నిర్వహించారన్నదీ నిర్వివాదాంశం.

ముద్రగడ పద్మనాభంతో నేరుగా మాట్లాడి, వైసీపీ నుంచి పోటీ చేసేలా ఆయన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒప్పించారన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ రావాలన్న ఉద్దేశ్యంతో ముద్రగడ స్వయంగా, వైసీపీ నుంచి సీటుని ఆశించి, జగన్‌తో మంతనాలు సాగించారన్నది మరో వాదన.

పిఠాపురం నుంచి పోటీ చేయాలని ముద్రగడ తొలుత అనుకున్నా, ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ విషయమై స్పష్టత రాబోతోందిట. ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనీ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన సేవలు పార్టీకి ఉపయోగపడ్తాయనీ వైఎస్ జగన్, పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే వివరించినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం కాస్త గట్టిగానే వుండబోతోందంటూ, ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్ టీమ్ ఇచ్చిన నివేదికల ఆధారంగా చేసుకుని, ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అయితే, వైసీపీలో చేరే విషయమై ఇంతవరకు ముద్రగడ పద్మనాభం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు.!