హాట్ టాపిక్… ముద్రగడ వర్సెస్ కొణిదెల @ కాకినాడ!

ఏపీలో టీడీపీ – జనసేన దూకుడు పెంచుతున్నాయి. సమన్వయ సమావేశాలు జరుపుతున్నాయి. మరోపక్క సీట్ల సర్ధుబాటు విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంల్మో త్యాగాలు చేయాల్సిన నేతల బుజ్జగింపు చర్యలు కూడా జరుగుతున్నాయని.. ఇందులో భాగంగానే ఒక్కో టీడీపీ నేతకు లోకేష్ నుంచి కాల్స్ వెళ్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో నాగబాబు విషయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఈసారి ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలంగ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీతో కలిసి జగన్ సర్కార్ ని గద్దె దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తన అన్న నాగబాబు గురించి కూడా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అన్నను పార్లమెంట్ కు పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి గత ఎన్నికల్లోనూ నాగబాబు.. నరసాపురం లోక్ సభ స్థానంనుంచే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకి 4,47,594 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి శివరామరాజుకి 4,15,685 ఓట్లు వచ్చాయి. దీంతో 31,909 మెజారిటీతో వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసిన నాగబాబుకు 2,50,289 ఓట్లు పోలయ్యాయి.

అయితే ఈసారి నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాకుండా… మరింత సేఫ్ జోన్ ని సెలక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే కాకినాడ లోక్‌ సభ నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబు ప్రస్తావన తెచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రతిపాదనకు టీడీపీ తరపున పాల్గొన్న నేతల నుంచి కూడా ఆమోదం వచ్చిందని అంటున్నారు. ఫలితంగా టీడీపీ – జనసేన ఉమ్మడి లోక్ సభ అభ్యర్థిగా నగబాబు కాకినాడ ఎంపీగా పోటీ చేయడం ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు.

కాగా 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌ పై వైసీపీ అభ్యర్థి వంగా గీత 25,738 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తుని, పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటి, పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో పెద్దాపురంలో తప్ప మిగిలిన అన్ని చోట్లా వైసీపీ అభ్యర్థులే గెలిచారు.

అయితే ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ… ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన గీతకు వచ్చిన మెజారిటి కేవలం పాతిక వేల ఓట్లు మాత్రమే కావడంతో… ఇది సేఫ్ సీటు అని పవన్ ఆలోచించారని తెలుస్తుంది. ఫలితంగా… ఈసారి నాగబాబుకు ఆ సీటు కేటాయిస్తే గెలుపు కన్ ఫాం అయ్యే అవకాశం ఉందని అంటున్నారని తెలుస్తుంది.

అయితే వైసీపీ నుంచి ఈసారి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభం పోటీచేసే అవకాశం ఉందని.. ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అదే జరిగితే… కాకినాడ లోక్ సభ స్థానంలో నాగబాబు వర్సెస్ ముద్రగడ పద్మనాభం మధ్య బిగ్ ఫైట్ విత్ రసవత్తరత ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు!

కాగా 1999 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేసిన ముద్రగడ పద్మనాభం 1,21,435 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా… 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ అభ్యర్థి పల్లంరాజు చేతిలో 57,252 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.