ముద్రగడ – తీహార్ జైలు… మధ్యలో ఎవరు?

ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడానికి కాపు నాయకుడు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రాబోతున్నారు. ఈ మేరకు ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా చెబుతున్న ముద్రగడ… తనను తుని రైలు దహనం కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో తనను తీహార్ జైలుకు పంపాలనే కుట్ర సైతం జరిగిందని సంచలన విషయాన్ని వెల్లడించారు ముద్రగడ.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత తునిలో రైలు దహనం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మైకందుకున్న బాబు… ఇదంతా రాయలసీమ రౌడీలు చేశారంటూ జగన్ ని ఉద్దేశించి కామెంట్లు చేశారు. కానీ అనంతరం తాను ఆరోపించిన రాయలసీమ వారిపై కాకుండా… గోదావరి జిల్లాలోకి కాపు సామాజికవర్గానికి చెందిన సుమారు 40 మందిపై కేసులు పెట్టారు. అయితే తాజాగా కోర్టు వీరందరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే… వీరందరిపై గత చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులను జగన్ సర్కార్ ఎత్తివేసింది.

తాజాగా ఆ విషయాలపై స్పందించిన ముద్రగడ… తుని రైల్ దహన కేసుకు సంబంధించి తనను ఏపీలో కూడా ఉండనీయకూడదు కొంతమంది అనుకున్నారని.. తనను ఏకంగా తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాటు చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మరోపక్క ఈ కేసులో బెయిల్ తెచ్చుకోమని వత్తిడి చేశారని.. బెయిల్ తెచ్చుకుని అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోమని సలహాలు ఇచ్చారని చెప్పారు. దీంతో… ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే… ఈ టైపు రాజకీయాలు చంద్రబాబు మాత్రమే చేస్తారని.. ఫలితంగా గోదావరి జిల్లాలకే సంబంధించిన కాపు సామాజికవర్గ నేతతో ముద్రగడకు ఆ మేరకు సమాచారం పంపించారని అంటున్నారు నెటిజన్లు. ఫలితంగా తనకు రాజకీయగా రోజు రోజుకీ ఇబ్బందిగా మారుతున్న కాపు ఉద్యమాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించేవేసే ప్రయత్నం చంద్రబాబు చేసి ఉంటారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా… ఈ విషయంలో ముద్రగడ మరింత క్లారిటీ ఇచ్చేవరకూ… తమ క్రియేటివిటీకి నెటిజన్లు పనిచెబుతూనే ఉంటారు!!