వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం పాలసీపై ఆయన ఈసారి వ్యాఖ్యానించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల శ్రమను మద్యం వ్యాపారులు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీలో ఉన్న ప్రస్తుత మద్యం పాలసీ.. మద్యం వ్యాపారాన్ని పెంచడానికే ఉపయోగపడుతుందని విమర్శించారు. కల్తీ మద్యంతో, నాసిరకం బ్రాండ్లతో మద్యం వ్యాపారులు ప్రజల రక్తాన్ని తాగుతున్నారని.. వాళ్లపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ డిమాండ్ చేశారు.
దేశంలో ఎక్కడ చూసినా.. సంపూర్ణ మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలు సాధ్యం కాలేదు. బీహార్ లో మద్యం నిషేధం వల్ల మద్యం అక్రమ రవాణా ఎక్కువైంది. ఎక్కువ ధరలు పెట్టి మద్యాన్ని అక్రమంగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడి.. అక్కడి పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక్కడ కూడా సంపూర్ణ మద్య నిషేధం అనేది జరగని పని.. అని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో కూడా అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వమే వైన్ షాప్ లను నిర్వహిస్తున్నా.. అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది.. ఎన్నో బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ ధరలు ఉండటం వల్ల ప్రజలు.. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి వాళ్ల మీద కేసులు పెట్టి వేధించడం కరెక్ట్ కాదంటూ… ఎంపీ అన్నారు.